కొల్లాపూర్, జూలై 29 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటు చేసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు శివారులో రేగుమాన్గడ్డ వద్ద పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరగగా, జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన ఐదుగురు కూలీలు మృతిచెందారు. అలాగే రాజమండ్రికి చెందిన సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లో అడుగు భాగం నుంచి కాంక్రీట్ పనులు చేపడుతున్నారు. అయితే, జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన బోలోనాథ్ (25), శ్రీను (22), ప్రవీణ్ (24), సోను (26), కమలేష్ (23), రాజమండ్రికి చెందిన సెక్యూరిటీ గార్డు కలిసి భారీ క్రేన్ సాయంతో పంపుహౌస్ అడుగుభాగంలో పనులు జరిగే చోటుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో షార్ట్ సర్కూట్ కారణంగా క్రేన్ రూఫ్‌పై వైర్లు తెగిపోయాయి. దీంతో క్రేన్ బకెట్‌తో సహా పంప్‌హౌస్‌లో అడుగు భాగానికి పడిపోయింది. ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను, గాయాలపాలైన సెక్యూరిటీ గార్డును అంబులెన్స్‌లో హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు.
అయితే, ఈ ఘటన జరిగిన విషయాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. శుక్రవారం ఉదయం అందులో పనిచేస్తున్న కార్మికుల ద్వారా సమాచారం దావానంలా వ్యాపించింది. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ రానీయకుండా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా, తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబీకులు హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ చేరుకొని ఆందోళన చేపట్టారు. ఒక్కొక్కరికీ రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా దవాఖాన వద్ద మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి బాధిత కుటుంబాలను వేర్వేరుగా పరామర్శించారు. కంపెనీ తరుఫున బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని రఘువర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వం సెంట్రల్ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ శ్రీనివాసనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కొల్లాపూర్ పోలీసులు తెలిపారు.