అమరచింత, జూలై 26: జూరాల ఎడుమకాలువల ద్వారా విడుదల చేసే సాగునీటిని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఎగువనుంచి జూరాలకు 24,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా పవర్‌హౌస్‌లోకి 21వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భీమా ఎత్తిపోతలకు 650 నీటిని విడుదుల చేస్తున్నారు. మొత్తంగా 26వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర జలాశయానికి..
అయిజ, జూలై 26: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే 12గేట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 35,458 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 35,458 క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 104.824 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల గరిష్ఠ నీటిమట్టానికిగానూ, ప్రస్తుతం 1632.76 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుతోంది. మంగళవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 32,483 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 31,900 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 583 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలం జలాశయానికి..
శ్రీశైలం, జూలై 26: శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరదనీరు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 21,478 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 29,449 క్యూసెక్కుల నీరు(మొత్తం 50,927 క్యూసెక్కులు) విడుదల కాగా సాయంత్రానికి 37,000 క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా ఏపీ పవర్‌హౌస్ ద్వారా 31,498, టీఎస్ పవర్‌హౌస్ ద్వార 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తి చేసి దిగువకు విడుదల చేశారు. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.70 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 19.651 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.