మక్తల్ రూరల్/ఊట్కూర్, జూలై 26: మక్తల్ మండలంలోని సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు జలకళ సంతరించుకున్నది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కర్ణాటక ఎగువ ప్రాంతం నుంచి సంగంబండ (నర్సిరెడ్డి) బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామం ఇడ్లూరు శివారులో ప్రవహిస్తున్న పెద్ద వాగు ఉధృతిని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో కర్ణాటక ఎగువ నుంచి పెద్ద వాగు ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 7గంటల ప్రాతంలో ఎమ్మెల్యే మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శంకరలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని వాగు నీటిని పర్యవేక్షించారు. పెద్ద వాగు నీరు సంగంబండ రిజర్వాయర్‌కు చేరుతుండటంతో అక్కడి నుండి నేరుగా సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు.
రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని పరిశీలించిన అనంతరం మొత్తం 10 గేట్లలో 2 గేట్ల షట్టర్లను దగ్గరుంచి ఎత్తివేయించారు. ఈక్రమంలోనే ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని రైతులను అప్రమత్తం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇదిలావుండగా సంగంబండ (నర్సిరెడ్డి) బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్ పూర్తి స్థాయి నీటి మట్టం సామర్థ్యం 3.67 లెవల్ ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 2.4 టీఎంసీలు ఉంది. అయితే 3.62 అడుగుల చేరువకు దగ్గరలో ఉందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. సోమవారం మక్తల్‌లో 39.4 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మక్తల్ సీఐ సీతయ్య, ఊట్కూర్ ఎస్సై రాములు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు జయప్రకాశ్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఎల్లప్ప, ఈశ్వర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.