గండీడ్, జూలై 26 : అప్పటి వరకు తోటి స్నేహితులతో కలిసి సంతోషంగా పదో తరగతి పూర్తి చేసుకొని ఇంటర్లో చేరాడు.. ఇంతలోనే బోన్ మ్యారో వ్యాధి బారిన పడడంతో కుంగిపోయాడు. తండ్రి తనకున్న రెండెకరాల పొలాన్ని తాకట్టు పెట్టి రూ.4లక్షలు అప్పు చేసి బతికించుకున్నాడు. సంవత్సరం బాగానే ఉన్నాడు..మూడు నెలల కింద మహమ్మారి మళ్లీ తిరగబడింది. చికిత్సకు మరో రూ.6లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబంపై పిడుగుపడినట్లు అయింది. దిక్కుతోచని స్థితిలో ఉండిపోయి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స కోసం ఆర్థికంగా ఎవరైన సాయం చేస్తారని ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గండీడ్ మండలంలోని సాలార్‌నగర్ గ్రామానికి చెందిన అంజిలయ్యగౌడ్ రాములమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు వేణుగోపాల్‌గౌడ్ ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటర్లో చేరగానే దురదృష్టవశాత్తు విద్యార్థికి బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడ్డాడు. నిరుపేద కుటుంబం పూట గడవడమే కష్టంగా ఉన్న రోజల్లో తన తండ్రి ఉన్న రెండు ఎకరాలు తాకట్టు పెట్టి రూ.4లక్షలు అప్పుగా తీసుకొచ్చి వైద్యం చేయించడంతో ఆరోగ్యం మెరుగుపడింది. వేలల్లో ఒకరికి వ్యాధి తిరగబడే అవకాశం ఉంది.
అయితే వేణుగోపాల్ మళ్లీ మహమ్మారి బారిన పడడంతో మూడు నెలలుగా మెహ్ది నవాజ్ జంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇప్పటి వరకు దాదాపు రూ.6 లక్షలదాక వైద్యఖర్చులు కాగా మరో రూ.6లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమవుతున్నాయని వైద్యులు చెప్పినట్లు అంజిలయ్యగౌడ్ తెలిపారు. ఉన్న నాలుగు బర్రెలు అమ్మి.. రెండెకరాల పొలాన్ని కుదువ పెట్టామని తాకట్టు పెట్టడానికి కూడా తమతో ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తేనే బాబుకు వ్యాధి నయం అవకాశం ఉందని వైద్యులు తేల్చి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించి తమ కమారుడి బ్లడ్ క్యాన్సర్ బారి నుంచి కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కుటుంబ సభ్యుల 9960033088 నెంబర్‌కు ఫోన్‌పే లేదా గూగుల్‌పే చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.