మహబూబ్‌నగర్, జూలై 26 : భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజినీరింగ్, సంబంధింత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉద్యాన పంటల భూసేకరణతోపాటు పెండింగ్‌లో ఉన్న పీవీ, డీడీల ప్రచురణ త్వరగా పూర్తిచేయాలన్నారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో చెట్ల విలువలు లెక్కించాలని తెలిపారు. ఉదండాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన భూసేకరణకు ప్రాధాన్యత ఇచ్చి త్వరగా పూర్తిచేయాలన్నారు. ఎక్కడైనా ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ పంపించాల్సి ఉంటే పంపించాలన్నారు. ధరణిలో భూసేకరణకు సంబంధించిన 2021 ఉన్న అన్ని కేసులను పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఉదండాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన వల్లూరు ఆర్అండ్ఆర్, ఉదండాపూర్ తదితర భూసేకరణపై కలెక్టర్ సమీక్షించారు. అవార్డు పాస్ చేయాల్సిన చోట తక్షణమే పాస్ చేయాలన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద పీఎన్కు ప్రతిపాదించామని, డీడీని ప్రచురించాల్సి ఉందని ఇంజినీరింగ్ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైల్వే డబుల్‌లైన్‌కు సంబంధించి సకాలంలో భూసేకరణ పూర్తి చేసినందుకు గానూ రైల్వే అధికారులు, తాసిల్దార్లు, ఆర్డీవోలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌నందలాల్ పవార్, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్‌కుమార్, జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉదయ్, శంకర్, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.