మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 26: ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల్లో బోధన సామర్థ్యాలు తగ్గడాన్ని గుర్తించి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఆర్వీఎం సమావేశ మందిరంలో తెలుగు, ఇంగ్లిష్, న్యూటౌన్ స్కూల్లో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారిలో కనీస సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్, రాష్ట్ర పర్యవేక్షకులు నీరజ, సెక్టోరియల్ అధికారులు వెంకట్రామిరెడ్డి, బాలుయాదవ్, ఆర్పీలు నాగరాజు, ప్రకాశ్, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి
పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ అన్నారు. మంగళవారం న్యూటౌన్ మార్కెట్ పరిసరాల ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులను తనిఖీ చేసి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో ఫాగింగ్, చెత్తచెదారం తొలగింపుపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా న్యూటౌన్ ఉర్దూ మీడియం హైస్కూల్‌ను అడిషనల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించి తరగతిలో విద్యార్థులతో మాట్లాడారు. భోజనం ఎలా ఉందని, ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తక్కువగా ఉన్నారని హెచ్ఎంను అడుగగా.. వర్షం వల్ల రాలేదని తెలిపారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, హెచ్ఎం ఖలీల్, ఉపాధ్యాయులు అక్తర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.