పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పాలను పారబోసి ఖాళీ క్యాన్లతో ధర్నాకు దిగారు. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం జీఎస్టీ విధించడం అన్యాయమని ధ్వజమెత్తారు. రైతులకు ప్రధాన ఆదాయ వనరైన పాలపై జీఎస్టీ విధించడాన్ని తప్పుబట్టారు. నారాయణపేటలో పార్టీ నాయకులు వినూత్న రీతిలో ధర్నాకు దిగారు. గేదెను తీసుకొచ్చి ఖాళీ పాలక్యాన్లతో నిరసన వ్యక్తం చేశారు.
– మహబూబ్‌నగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పాలపై జీఎస్టీ తగదు
నారాయణపేట, జూలై 20 : పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దారుణమని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ ధరలకు వ్యతిరేకంగా బుధవారం పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాలక్యాన్లు, గేదెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలపై జీఎస్టీ నిర్ణయంతో.. ఆ రంగంపై ఆధారపడిన వారికి, సామాన్య ప్రజలకు పెనుభారంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాశ్, టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, కౌన్సిలర్లు గురులింగప్ప, మహేశ్, నాయకులు వెంకట్రాములు, సుదర్శన్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గాలికి కూడా జీఎస్టీ విధిస్తారేమో?
పసిపిల్లలు తాగే పాలపై కేంద్రం జీఎస్టీ విధించడం చూస్తుంటే.. మోదీ సర్కార్ భవిష్యత్ లో ఇంకా ఇలాంటి పన్నులు ఎన్ని విధిస్తుందో అని భయమేస్తున్నదని.., చివరకు గాలిపై కూడా జీఎస్టీ విధించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో మం త్రి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక నిరంతర ఉచిత విద్యుత్, సాగునీరు అందించడం వల్ల వ్యవసాయంతోపాటు అనుబంధ పరిశ్రమలు కూడా ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయన్నారు. పాడిరైతుపై కేంద్రం దుర్మార్గంగా పన్నుల భారం మోపడం అన్యాయమన్నారు. దేశంలో రైతులు బతకాలా.. వద్దా.? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రతి వస్తువుపై జీఎస్టీ విధించడంతో అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. నిరుపేదలైన దళితులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో చాలామందికి పాడిపరిశ్రమ యూనిట్లు కేటాయించామని.., పంజాబ్, హర్యానా, ఏపీ వంటి రాష్ర్టాల నుంచి మేలు రకం బర్రెలను తీసుకొచ్చి పోషించుకునే స్థాయిని కల్పించామన్నారు. ఇటీవలే వంటగ్యాస్ ధరలను అమాంతంగా పెంచిన కేంద్రం వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశామని.. ఇప్పుడు పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తు ధర్నాకు దిగామన్నారు. జీఎస్టీని బేషరతుగా రద్దు చేయాలని.. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.