బల్దియాల్లోని ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2021-22 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో ఈ ఏడాది అక్టోబర్ 31లోగా అసలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించింది.
ఆస్తిపన్ను వడ్డీ 90శాతం మాఫీ
వన్‌టైం స్కీంను ప్రకటించిన ప్రభుత్వం
అక్టోబర్ 31 వరకు అవకాశం
మహబూబ్‌నగర్ టౌన్, జూలై 18 : బల్దియాల్లోని ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2021-22 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో ఈ ఏడాది అక్టోబర్ 31లోగా అసలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకంతో మొండి బకాయిలు వసూలు కానుండగా, బల్దియాలకు మరింత ఆదాయం సమకూరనున్నది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీల్లో పన్ను వసూలు పెరగనున్నది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పరిధిలో సుమారు 20వేలకుపైగా ఇండ్ల యజమానులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది. గతేడాది దాదాపుగా రూ.3 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆస్తిపన్ను వడ్డీ రాయితీపై మెస్సేజ్‌లు, అవగాహన, చైతన్య సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటి, దుకాణ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్ కోరుతున్నారు.