మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 17 : పాఠశాలలు ప్రారంభమైనా విద్యార్థులను తీసుకెళ్లే ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వేసవి సెలవుల్లో పిల్లలను తమ పాఠశాలలో చేర్పించుకునేందుకు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన యాజమాన్యాలు సకాలంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ మాత్రం చేయించుకోలేదు. రవాణాశాఖ నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలి. పూర్తిస్థాయిలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బస్సుల ఫిట్నెస్ పూర్తికాకపోవడంపై ఆర్టీవో అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏదైనా వాహనం రోడ్డెక్కాలంటే పూర్తిస్థాయి ఫిట్నెస్ ఉండాలి. లేదంటే ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. నెలరోజులు ముందు నుంచే ఫిట్నెస్తోపాటు ఇతర నిబంధనల విషయమై జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రచారం చేసినా అందుకు పాఠశాలల యాజమాన్యాలు ముందుకు రాకపోవడంపై అధికారులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో 303 బస్సులు
జిల్లాలో 303స్కూల్ బస్సులు ఉన్నాయి. పాఠశాలలు తెరిచి నెల రోజులు గడిచినా స్కూల్ యాజమాన్యాలు సామర్థ్యం పరీక్షలు చేయించలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఫిట్నెస్ చేయించుకున్న బస్సులు 178 మాత్రమే ఉన్నాయి. 125బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు. ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే చాలా వరకు ప్రమాదాలు జరిగే ముప్పు ఉంది.
క్షేత్రస్థాయిలో తనిఖీలు
విద్యాసంస్థలు ప్రారంభమైన రోజు నుంచే బస్సుల ఫిట్‌నెస్‌పై విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టామని జిల్లా ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని కఠినంగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు చెందిన డ్రైవర్లు, యాజమాన్యాలకు విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఫిట్నెస్ లేకుంటే సీజ్
విద్యార్థుల భద్రత నేపథ్యంలో ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కే బస్సులను అక్కడిక్కడే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. పాఠశాలల బస్సులు నడిపే డ్రైవర్లకు ఐదేండ్ల అనుభవం ఉండాలని, 60 ఏండ్లలోపు ఉన్న వారినే కొనసాగించాలని సూచిస్తున్నారు. విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలలకు, పాఠశాల నుంచి ఇంటికి క్షేమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలపై ఉంటుందన్నారు. అవేవీ పట్టించుకోకుండా డ్రైవర్‌ను తక్కువ జీతానికి మాట్లాడుకొని, అతని ఫిట్నెస్, లైసెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో నిబంధనలను పాటించేలా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రోడెక్కితే చర్యలు తప్పవు
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించకుండా నడిపితే సీజ్ చేస్తాం. డ్రైవర్‌తోపాటు విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. ప్రతి బస్సుకు ఆర్టీఏ నిబంధనల మేరకు ఫిట్నెస్తోపాటు పొల్యూషన్ సర్టిఫికేట్, పర్మిట్ సర్టిఫికేట్, డ్రైవర్‌కు ఐదేండ్ల పైబడి అనుభవం, 60ఏండ్లలోపు ఉన్న వారే బస్సులను నడుపాలి. బస్సుల జీవితకాలం 15ఏండ్లలోపు ఉండాలి. కరోనా కారణంగా రెండేండ్లుగా చాలా బస్సులకు పరీక్షలు చేయించలేదు. ఈ ఏడాది ఫిట్నెస్ అర్హత లేకుండా రోడ్లపైకి వస్తే అనుమతించేది లేదు. లేదంటే బస్సులను సీజ్ చేస్తాం.
– దుర్గ ప్రమీలా,ఉమ్మడి జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్