జడ్చర్లటౌన్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్ తదితర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల కోసం సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆదివారం పట్టణంలోని పీఆర్టీయూ సంఘం భవనంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పేద విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ విద్య అందించేలా గురుకులాలను అప్‌గ్రేడ్ చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి రీతిలో బోధిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మన ఊరు- మన బడి ద్వారా సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు.
ఎన్నడూ లేనివిధంగా వివిధ శాఖాల్లో ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాకు నాలుగు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలన్న ఉద్దేశంతో సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్ సంస్థ శిక్షకులతో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భోజన వసతితోపాటు స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీజేఆర్ సంస్థ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.