కల్వకుర్తి, జూలై 17: కృష్ణానది ఉపనది దుందుభీకి వరదలొస్తే కల్వకుర్తి – నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తెల్కపల్లి మండలానికి రాకపోకలు నిలిచిపోతాయి. వరద ఉధృతి తగ్గితేనే రాకపోకలు ప్రారంభమవుతాయి. అత్యవసరమైతే కల్వకుర్తి ప్రయాణికులు తెల్కపల్లి వెళ్లాలనుకుంటే అచ్చంపేట లేదా నాగర్‌కర్నూల్ మీదుగా వెళ్లాలి. లేకుంటే ఎక్కడివారు అక్కడ ఉండిపోవాల్సిందే. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంలో రాకపోకలుకు అంతరాయం ఏర్పడింది. నదిపై ఏర్పాటు చేసిన కాజ్‌వేపై వరదనీరు దాదాపు రెండు మీటర్ల ఎత్తున ప్రవహిస్తుండటంలో మనుషులే కాదు.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది.
కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద..
కల్వకుర్తి నియోజకవర్గం- నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలను కృష్ణానది ఉపనది దుందుభీ నది విభజిస్తున్నది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామం-తెల్కపల్లి మండలాల మధ్య దుందుభీ వాగు ఉంది(దీన్ని వాడుక భాషలో పెద్ద వాగు, డిండి వాగు అని పిలుస్తారు) వర్షాకాలంలో దుందుభీ ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురిస్తే వాగుకు వరదలు వస్తాయి. వరదలు వస్తే వాగులో రాకపోకలు నిలిచిపోతాయి. వాగులో నీరు లేనప్పుడు రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా కాజ్వే నిర్మించారు. కాజ్వే కూడా చాలావరకు దెబ్బతిన్నది.
వర్షాలు వస్తే రాకపోకలు బంద్
వర్షాలు కురిసి వాగు పారితే ప్రయాణాకులు తీవ్ర ఇబ్బందులు పడుతారు. కల్వకుర్తికి నుంచి తెల్కపల్లితోపాటు చుట్టు పక్కన మండలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అచ్చంపేట, నాగర్‌కర్నూల్ మీదుగా గమ్యస్థానాలకు వెళ్లాల్సిన దుస్థితి. చాలా ఏండ్లుగా రఘుపతిపేట వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు వాగులో కలిసిపోయాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక..
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుందుభీ వాగుపై రఘుపతిపేట వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా కల్వకుర్తి నుంచి తెల్కపల్లి వరకు సింగిల్రోడ్గా ఉన్న ఆర్అండ్బీ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రతిపాదనలు తయారు చేయించి నిధుల కోసం పరిపాలన ఆమోదం చేయించారు. మొదటి విడుత పనుల్లో భాగంగా రూ.14కోట్లు మంజూరయ్యాయి. రూ.14కోట్లతో కల్వకుర్తి నుంచి గుండూర్ వరకు డబుల్‌రోడ్డు పూర్తయింది. రెండో విడుతలో భాగంగా గుండూర్ నుంచి తెల్కపల్లి మండలకేంద్రం వరకు 15.8కిలోమీటర్ల మేర డబుల్‌రోడ్డు విస్తరణ పనులకు రూ.20కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పూర్తయ్యాయని, సోమవారం టెండర్లు ఓపెన్ చేస్తున్నట్లు నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు చెప్పారు. కల్వకుర్తి నుంచి తెల్కపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే కల్వకుర్తి నుంచి తెల్కపల్లి, లింగాల మీదుగా కొల్లాపూర్‌కు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని ఎంపీ పేర్కొన్నారు.
రూ.45కోట్లతో ప్రతిపాదనలు
కల్వకుర్తి-తెల్కపల్లి మండలాల మధ్య రఘుపతిపేట వద్ద దుందుభీ నదిపై రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం కేసీఆర్ టేబుల్‌పై ఉంచినట్లు ఎంపీ రాములు చెప్పారు. బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించి అన్ని విభాగాల రిపోర్టులను క్లియరెన్స్ చేసి ఆమోదం కోసం ముఖ్యమంత్రి వద్దకు ఫైల్ పంపించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోద ముద్ర పడగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడమే తరువాయి అని ఎంపీ తెలిపారు.
బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు
రఘుపతిపేట వద్ద దుందుభీపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం అయితే శాశ్వతంగా వరద కష్టాలు తొలగిపోతాయని కల్వకుర్తి, తెల్కపల్లి మండలాలవాసులు అంటున్నారు. కల్వకుర్తి, తెల్కపల్లి మండలాలు ఓ విధంగా చెప్పాలంటే జంట మండలాలు. రెండు మండలాల నియోజకవర్గాలు వేరు కావచ్చుగాని, రెండు మండలాలకు చెందిన ప్రజలకు చాలా సత్సంబంధాలు ఉంటాయి. ఈ మండలాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత, వ్యవసాయ, వ్యాపార అవసరాల నిమిత్తం అటు ఇటు తిరుగుతుంటారు. వాగుకు వరదొస్తే ఐదారు రోజులపాటు వారి కార్యకలాపాలు నిలిచిపోతాయి.