మక్తల్ టౌన్, జూలై 7: మక్తల్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ధ్వజస్తంభం రాయిని భక్తిశ్రద్ధలతో మారెమ్మ దేవాలయం నుంచి వేణుగోపాలస్వామి ఆలయానికి తరలించినట్లు ఆలయ కమిటీ సభ్యు లు తెలిపారు. గురువారం మక్తల్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభాన్ని కర్ణాటకలోని హంపి పరిసర ప్రాంతాల నుంచి మక్తల్ పట్టణంలోని మారెమ్మ దేవాలయానికి తీసుకురాగా అక్కడి నుంచి భక్తు లు ఊరేగింపుగా భజనలతో వేణుగోపాలస్వామి ఆలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ ధ్వజస్తంభం నిర్మాణం కోసం గవినోళ్ల బాల్రెడ్డి కుటుంబ సభ్యులు రూ.లక్షా యాభైవేల చందాను కమిటీ సభ్యులకు అందజేశారు. బాల్రెడ్డి కుటుంబ సభ్యులను కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ధ్వజస్తంభం ప్రతిష్టించేవరకు అయ్యే ఖర్చులు భరించేందుకు ముందుకువచ్చిన బాల్రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మక్తల్ పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి తమ వంతు సాయంగా నియోజకవర్గ ప్రజలు చందాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కావలి శ్రీహరి, కావలి ఆంజనేయులు, దేవరింటి నర్సింహారెడ్డి, చంద్రశేఖర్, కట్ట వెంకటేశ్, కర్ని గోపి, బుగ్గప్ప, రేణుక నర్సింహ, మామిళ్ల కిష్టప్ప, అంజి, సత్యనారాయణ, స్థానిక నేతలు పాల్గొన్నారు.