మహబూబ్‌నగర్, జూలై 7 : నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో గురువారం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మైనింగ్ బఫర్ జోన్లలో మొక్కలను నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్ నిర్వాహకులు పూర్తిస్థాయిలో మొక్కలను నాటాలని, లేనిపక్షంలో మైనింగ్‌ను నిలిపివేయనున్నట్లు తెలిపారు. అలాగే నాటే మొక్కలను జియోట్యాగింగ్ చేసేందుకు ప్రతి కార్యాలయంలో ఒక ఉద్యోగిని నియమించాలని తెలిపారు. అలాగే హరితహారంపై రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో అత్యధికంగా మొక్కలను నాటాలని పేర్కొన్నారు. సీఎస్ఆర్ కింద మొక్కలు నాటే విషయమై మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సీతారామారావుకు సూచించారు. దేవాదాయ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి వారానికి రెండుమార్లు సమీక్షించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు సూచించారు. మహిళా సంఘాలతో 2కోట్ల 50లక్షల విత్తనబంతులను తయారు చేయించాలని తెలిపారు.
సక్రమంగా మధ్యాహ్నభోజనం అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సక్రమంగా మధ్యాహ్నభోజనం అందించాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. పాఠశాలల్లో బియ్యం పాడుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించి హెచ్ఎంలకు సూచనలు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. ఈనెల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా బియ్యం సరఫరా చేస్తున్నందున ప్రత్యేకాధికారులు పర్యవేక్షణ పెంచాలని సూ చించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా లీకేజీల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. పైపులైన్ లీకేజీలకు తక్షణమే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. ప్రతి బుధవారం ప్రత్యేకాధికారులు మండలాలకు వెళ్లి ప్రజ ల ఆరోగ్య సంరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించాలని సూచించారు.
ఇంటింటా ఇన్నోవేటర్
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సాధారణ గృహిణి మొదలుకొని అన్నిరంగాల వారు ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు. రూపొందించే ఆవిష్కరణ ఎలాంటి సమస్యను పరిష్కరిస్తుందో స్పష్టంగా చెప్పాలని పేర్కొన్నారు. పరిష్కారరూపం సృజనాత్మకంగా, ప్రామాణికంగా ఉండాలన్నారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలను ఆగస్టు 5వ తేదీలోగా 9100678543 నెంబర్‌కు వాట్సాప్ చేయాలన్నారు. ఉత్తమం ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 8897155001 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, సీపీవో దశరథం, ఆర్డీవో అనిల్‌కుమార్, డీఈవో రవీందర్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
స్టేడియం పనుల పరిశీలన
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 7 : జిల్లా కేంద్రంలోని స్టేడియంలో చేపట్టిన ఇండోస్టేడియం నిర్మాణ పనులను కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు ఇండోస్టేడియం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా వాలీబాల్ అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పీఆర్ ఈఈ నరేందర్, డీవైఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.