గద్వాల, జూలై 7 : దేవుడు మనిషికి జన్మనిస్తే అవయవదానం చేసి చరిత ముగ్గురు వ్యక్తులకు పునర్జన్మ నిచ్చిందని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. ఏడు వసంతాల తర్వాత సంతానం కలిగితే పుట్టిన బిడ్డను చూడకుండా బ్రె యిన్ డెడ్‌తో చరిత మరణించిందని, మరణం తర్వాత అ వయవాలను బూడిద కానివ్వకండి అని సూచించారు. జిల్లా కేంద్రానికి చెందిన చరిత మగబిడ్డకు జన్మనిచ్చి బ్రెయిన్‌డెడ్ అయి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని సినీ నటుడు జగపతిబాబు పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జగపతిబా బు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అమ్మ ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరని తెలిపారు. చరితకు పళ్లైన ఏడు సంవత్సరాలకు సంతానం కలిగిందని, కానీ ఆనందాన్ని తాను ఆస్వాదించకుండా కుటుంబాన్ని పుట్టెడు దు:ఖంలో నింపి కానరాని లోకానికి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అవయదానం చేసిందని చెప్పగానే మనస్సు చలించిందని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి గద్వాలకు వచ్చినట్లు తెలిపారు.

మనిషి మరణించిన తర్వాత ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు ఇలా ఇతర అవయవాలు మరణానంతరం వేరే వారికి అమర్చితే వాళ్లకు కొత్త జీవితం లభిస్తుందని చెప్పారు. తన పుట్టిన రోజు సందర్శంగా తాను అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవయవదానం నిర్ణయం తీసుకోవడం ఎంతో సాహసోపేతమని వారి కుటుంబ సభ్యుల స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలన్నారు. చరిత కుటుంబాన్ని జెడ్పీ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ కేశవ్, వార్డు కౌన్సిలర్ ప్రియాంక పరామర్శించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చందూనాయక్, కిమ్స్ దవాఖాన కర్నూల్ వైద్యులు గోవర్ధన్‌రెడ్డి, అనంతరావు, మనోజ్‌కుమార్, జములమ్మ ఆలయకమిటీ చైర్మన్ సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.