గుట్టుచప్పుడు కాకుండా మరోసారి జలదోపిడీకి తెరతీసింది ఏపీ ప్రభుత్వం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ.. ఆర్డీఎస్ కుడికాలువ నుంచి అక్రమంగా నీటి తరలింపు చర్యలను ముమ్మరం చేసింది. 4టీఎంసీలను 160 కి.మీ. కాల్వను తవ్వి గ్రావిటీ ద్వారా 4లిఫ్టులను ఏర్పాటు చేసి అక్రమంగా తరలించే కుట్రలు చేస్తున్నది. తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడంతో కొంతకాలం పనులు నిలిపివేసినా గుట్టుచప్పుడు కాకుండా స్ట్రక్చర్ నిర్మాణం పనులు పూర్తి చేసి గేట్లు అమర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. గేట్లు ఏర్పాటు చేసి కుడివైపు కెనాల్ నుంచి నీటిని తరలిస్తే జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గ పరిధిలో సాగునీరు అందకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అయిజ, జూలై 7 : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేష్‌కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి అక్రమంగా కాల్వను ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ గతేడాది జూన్‌లో చర్యలు చేపట్టింది. కేఆర్ఎం బీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల అనుమతులు లేకుండా ఆర్డీఎస్ కుడి వైపున కాల్వ పనులు వేగంగా పూర్తి చేసింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది నుంచి ఏపీకి నాలుగు టీ ఎంసీలు కేటాయించింది.
తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు అస్తవ్యస్తంగా చేపట్టిందని.., ఆ తీర్పును నిలిపివేయాలని కేఆర్ఎంబీకి గతంలోనే ఫిర్యాదు చేశారు. ఆర్డీఎస్ కుడివైపున అక్రమంగా కాల్వ పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో కొంతకాలం పనులు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా స్ట్రక్చర్ నిర్మాణం పనులు పూర్తి చేసి గేట్లు అమర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. గే ట్ల ఏర్పాటుకు కావాల్సిన స్టీల్, మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచిం ది.
ఏపీ ప్రభుత్వం కాల్వ పూర్తి చేసి నీటిని తరలిస్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వంద గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని, నదీ పరివాహక ప్రాంత ఆయకట్టు బీడుగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ పనులు తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నారు.
రూ.1,985.423 కోట్లతో పనులు..
ఆర్డీఎస్ ఆనకట్ట కుడి వైపున ఏపీ ప్రభుత్వం రూ. 1,985.423 కోట్ల వ్యయంతో కాల్వ పనులు చేపడుతున్నది. 160 కి.మీ. కాల్వను తవ్వి గ్రావిటీ ద్వారా నా లుగు టీఎంసీలను తరలించి 40 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు.. నాలుగు లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి మరో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్రమంగా నీటిని తరలిం చే కుట్రలు చేస్తున్నది. కర్నూల్ జిల్లాలోని రైతులకు సా గు, తాగునీటిని పుష్కలంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ కాల్వ పనులు చేపట్టింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని తుంగభద్ర నది నీటిని అక్రమంగా తరలించందుకు చర్యలు తీసుకున్న ది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, నదీనీటి హక్కులు కలిగిన రాష్ర్టాల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. కాల్వ పనులను ఏకపక్షంగా చేపట్టి పూర్తిచేస్తున్నది.

అలంపూర్ ఆయకట్టుకు నీటి కటకట..
కాల్వ నిర్మాణంతో అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటికి కటకట ఏర్పడనున్నది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి గ్రావిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం సునాయసంగా నీటిని తరలించేందుకు అవకాశం మెండుగా ఉండడంతో ఎడమ కాల్వ (తెలంగాణ ఆయకట్టు)కు నీటి రాక తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా.. ఏనాడూ 35 వేల ఎకరాలకు సాగునీరు అందిన దాఖలాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. ఈ కాల్వ పనులు పూర్తయితే.. ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. అలాగే తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలోని వంద గ్రామాలు తాగునీటికి, నదీతీర ప్రాంత ఆయకట్టు దాదాపు 4 లక్షల ఎకరాలు బీడుగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పనులు నిలిపివేయాలి..
ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నదీ జలాలను అక్రమంగా తరలించేందుకే ఆర్డీఎ స్ కుడివైపున పనులు చేపట్టింది. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతోపాటు ఏపీలో ని కర్నూల్ జిల్లాలో తాగు, సాగునీటికి ఇబ్బందులు కలిగించేలా చేపట్టిన కాల్వ పనులు తక్షణమే నిలిపివేయాలి. ఆర్డీఎ స్ ఆనకట్ట దిగువ ప్రాంతాలు సాగునీరు, తాగునీటి అవసరాల కోసం అనేక లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ లిఫ్ట్‌లకు తుంగభద్ర బోర్డులో నీటి కేటాయింపులు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా కాల్వ నిర్మాణం చేపట్టిందని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులను తుంగలో తొక్కి స్ట్రక్చర్ నిర్మాణం పూర్తి చేసి, కాల్వ పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నది. తెలంగాణ రైతుల పక్షాన అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేల సహకారంతో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్తాం. మంత్రుల ద్వారా సీఎం కేసీఆర్‌తో చర్చించి ఏపీ అక్రమ నీటి తరలింపును అడ్డుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేస్తాం. రైతుల ప్రయోజనాల దృష్ట్యా సుప్రీంకోర్టుకు వెళ్తాం.
– తనగల సీతారాంరెడ్డి, మాజీ చైర్మన్, ఆర్డీఎస్ ప్రాజెక్టు