జడ్చర్లటౌన్, జూన్ 21: జడ్చర్ల ఆబ్కారీ పోలీస్ స్టేషన్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం జడ్చర్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి చిందరవందరగా పడిఉన్న ఫైళ్లపై సిబ్బందిని మందలించారు. యూనిఫాం ఎందుకు వేసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. స్టేషన్లో అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న మహిళా సిబ్బందితో మాట్లాడారు.
ఏమైనా ఇబ్బందులుంటే చెప్పాలని సూచించారు. ఆబ్కారీ పోలీస్‌స్టేషన్‌లో సీజ్చేసిన శాంపిల్ బాటిళ్లను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన వాహనాలపై ఆరా తీసి వెంటనే వేలం వేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయాలని మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. స్టేషన్ ఆవరణలోని డాలర్ ట్రీ ప్లాంట్స్‌కు నీళ్లు పోయాలని సూచించారు. అనంతరం జడ్చర్లలోని విద్యానగర్‌కాలనీలో నివాసముంటున్న దేవునిపల్లి లక్ష్మీనర్సయ్యగౌడ్ మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మహబూబ్‌నగర్/టౌన్, జూన్ 21: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పాలకొండ ప్రాథమిక పాఠశాలలో గంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధిస్తున్నారన్నారు. పాలకొండలో ఓ అవ్వను ఆప్యాయంగా పలకరించారు. పింఛన్ వస్తుందా అవ్వ అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలకొండ అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు గుడ్డు తినిపించి బుద్ధిగా చదుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో ఉషారాణి, కౌన్సిలర్ నరేందర్ పాల్గొన్నారు.
వర్షంలోనూ తనిఖీ
వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా మినీ ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ప్రత్యేకంగా పరిశీలించారు. నిర్ధేశించుకున్న సమయంలోపు శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షానికి పనులకు ఆటంకం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. షిఫ్ట్‌ల వారీగా పనులు కొనసాగించాలన్నారు.