మూసాపేట, జూన్ 19: నూతనంగా ఏర్పడిన తెలంగాణలో పాలమూరు జిల్లా ఒకటి. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంటే కేవలం 8సంవత్సరాల కిందట మన పల్లెల పరిస్థితిపై ఒక్కసారి వెనుదిరిగి చూద్దాం..వాస్తవాలను గుర్తిద్దాం..ప్రజలకు జీవితంలో ప్రధానమైన వాటిలో తాగునీరు ఒకటి. మన పాలమూరులో ఏ గ్రామంలో చూసినా సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. సాగునీటి మాట పక్కన పెడితే తాగునీటి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండేది. పట్టణాల్లో నాలుగు నుంచి వారం రోజులకు ఒక సారి నల్లా నీళ్లు వచ్చేవి. పల్లెల పరిస్థితి మరీ దయానీయం. వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి బోర్లలో నీళ్లు ఉండేవి కాదు. మరో వైపు కరెంటు కోతలు.
కరెంటు ఉన్న కొంత సమయంలో ఆ బోర్ల నుంచి గ్రామాల్లో ఉండే వాటర్ ట్యాంకుకు నీళ్లు ఎక్కించినా నిండే పరిస్థితి లేదు. ఆ ట్యాంకులో ఉన్న నీటిని వదిలితే ఏ ఒక్క గల్లీకి కూడా సరిపడే పరిస్థితి ఉండేది కాదు. నల్లా నీళ్ల కోసం రాత్రి,పగలు తేడా లేకుండా ఇంటికి ఒకరిద్దురు గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చేది. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు డుమ్మాకొట్టి, మూలకుండే ముసలవ్వలు సైతం ఎప్పుడు నల్లా వస్తుందో అని వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఏ గల్లీకి వెళ్లినా మహిళలు తాగునీటి బిందెలతో కూస్తీలు పట్టేవారు.
తాగునీటి కోసం పల్లె ప్రజలు అల్లాడి పోయిన దుస్థితి ఉండేది. వ్యవసాయ బోర్లకు కూడా కరెంటు కోతలతో సరఫరా ఉండేది. దీంతో కరెంటు వచ్చిందంటే సరి ఒక్క బిందెడైనా నీళ్లు దొరికితే చాలంటూ పొలాల వెంట మహిళలు, యువకులు, చిన్నారులు బిందెలు పట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చేది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ఖాళీ బిందెలతో ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి ఇలా చెప్పుకుంటూ పోతే చేయని పోరాటం అంటూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కష్టాలు కథలు వర్ణణాతీతం. ఆ రోజుల్లో ఏ దినపత్రికను తిరిగేసినా ప్రతి రోజు ఏదో ఒక చోట తాగునీటి కష్టాల వార్తలు కనిపించేవి.
మరి నేడు..!
ఉద్యమ సమయంలో పాలమూరు ఎంపీగా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిన నిధులు కేవలం గ్రామాల్లో తాగునీటి బోర్లు వేయడానికి కూడా సరిపోయేవి కావు. ఆ ప్రాంత ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదేవిధంగా ఉండేది. ఎందుకంటే ఈ యేడు వేసిన బోర్లు వచ్చే ఏడుకళ్లా నీళ్లు అడుగంటి ఎండిపోయేవి. దీంతో మళ్లీ కొత్తబోరు వేయక తప్పని పరిస్థితి. ఇక గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల పరిస్థితి అయితే మరింత కష్టతరం. ఉదయం నిద్రలేచిన సమయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వాళ్లకు ఏదో ఓ గల్లీ నుంచి తాగునీటి కోసం ఫిర్యాదులు వచ్చేవి. ఎంతో మంది నాటి సర్పంచులు తాగునీటి కోసం నిద్ర లేని రాళ్ల్రు ఎన్నో గడిపారు. వారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా నాటి పరిస్థితులను మరిచిపోలేరు.
కరువు ప్రాంతం అయినా పాలమూరు జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు కేసీఆర్ కల్లారా చూశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్క పాలమూరులోనే కాదు యావత్ తెలంగాణలో మొత్తం ఇదే పరిస్థితి ఉందని తెలుసుకున్నారు. తాగునీటి కోసం మహిళలు పడుతున్న కష్టాలను తీర్చాలని సంకల్పించి కంకణం కట్టున్నారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని రూపకల్పన చేశారు. నూతంగా ఏర్పడిన రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టు. 2016లో పనులు ప్రారంభించారు. ఎక్కడికక్కడ జలశుద్ధి కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లో నూతన వాటర్ ట్యాంకులను నిర్మించారు. 2019 నుంచి ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుద్ధజలం అందించడానికి శ్రీకారం చుట్టారు. దీంతో దశాబ్ధాలుగా పడుతున్న తాగునీటి కష్టాలు తీర్చారు. కళ్ల ముందే చూసిన నాటి కన్నీటి కష్టాలు నేడు ఉన్నాయా.. నేడు ఆ గోస తీర్చి అపర భగీరథుడయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్..నాటి కన్నీటి కష్టాలకు కొన్ని చిత్రాలు నిదర్శనం..