కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 9 : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకొని మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నగరంలోని 4, 5, 16, 17, 18, 19, 21, 47 డివిజన్లలో జోరుగా ప్రచారం నిర్వహించారు. 47వ డివిజన్లో భారీ ర్యాలీ తీశారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చల్ల హరిశంకర్‌ను కార్పొరేటర్‌గా గెలిపిస్తే తాను మేయర్‌గా చేసి పంపిస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, నగరాన్ని మరింత సుందరంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. 2018లో మలాపూర్ గ్రామాన్ని అధికారులు కార్పొరేషన్లో విలీనం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మంత్రిగా ఉన్న తాను ఉపాధిహామీ కూలీలు, రైతులకు ఇబ్బంది అవుతుందని విలీనం కాకుండా కాపాడినట్టు గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ రాగానే మలాపూర్ను కార్పొరేషన్లో విలీనం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మలాపూర్ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ చొరవతో వందల కోట్ల నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. శాతవాహన యూనివర్సిటీ రోడ్డు నుంచి బద్దిపల్లి వరకు తారు రోడ్డు నిర్మాణం, మలాపూర్ రైతులకు ధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా ఇక్కడే కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేస్తే ఐదేళ్లపాటు ఇబ్బందులు తప్పవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్లలో నగరానికి రెండు రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకువచ్చి కొత్తపెల్లి చెరువులను నింపామన్నారు. ఈ ప్రచారంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, ఆయా డివిజన్ల అభ్యర్థులు రుద్ర నవిత, జమీలొద్దీన్, బెజ్జంకి అంజయ్య, గాదె రూప శ్రీనివాస్, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చందు, సంపత్‌రావు, ఓల్లాల మల్లేశం పాల్గొన్నారు.