జడ్చర్ల, జూన్ 19: రెండు నెలలుగా జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన అథ్లెటిక్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్ హాజరయ్యారు. కోచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ సమ్మర్ కోచింగ్‌తో విద్యార్థులు నైపుణ్యతను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అథ్లెటిక్స్‌లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అదేవిధంగా సమ్మర్‌క్యాంప్‌లో పాల్గొని వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో జాతీయస్థాయిలో పథకాలు సాధించి పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, సతీశ్, మానవహక్కుల సంఘం నాయకులు చెన్నయ్య, పీఈటీలు శ్రీనివాస్, మోయిన్, శ్రీనివాస్, చందు, అయూబ్, మల్లికార్జున్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.