మహబూబ్‌నగర్, జూన్ 19 : కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి వద్ద రూ.కోటి వ్యయంతో నిర్మించిన బసవ భవనాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారి కోసం బతకాలనేది బసవేశ్వరుడి సిద్ధాంతమన్నారు. ఎదుటి వ్యక్తికి సాయం చేయాలన్న బసవేశ్వరుడి బాటలో నడవాలని సూచించారు. వీరశైవ లింగాయత్ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఎకరా స్థలంతోపాటు బసవ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను భారీ గజమాలతో సత్కరించారు.
ప్రయాణం మరింత సులభం
ప్రధాన రహదారులకు అనుసంధానంగా రోడ్లను నిర్మించడంతో సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డు నుంచి శ్రీనివాస కాలనీకి అనుసంధానం చేసే రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడళ్లు ఎంతో సుందరంగా మారాయన్నారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం, పాలకొండ-భూత్పూర్ రోడ్డును కలిపేందుకుగానూ భారత్‌మాల రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్ పనులను మంత్రి పరిశీలించారు. అలాగే మహబూబ్‌నగర్-జడ్చర్ల మధ్య జరుగుతున్న రోడ్డు పనులను తనిఖీ చేశారు. టీడీ గుట్ట ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ మాతృమూర్తి దశదినకర్మకు మంత్రి హాజరయ్యారు. జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం ఇన్చార్జి అధ్యక్షుడిగా పోతులమడుగు సత్యనారాయణ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు.
టీఆర్ఎస్లో చేరిన పలువురు
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు నాయకులు హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హన్వాడ మండలానికి చెందిన హేమసముద్రం ఆయకట్టు చైర్మన్ అనంతరెడ్డి, బుచ్చయ్య, చెన్నారెడ్డి, రామస్వామి, చెన్నకేశవ్, పుల్లయ్యతోపాటు రైతు, కార్మిక సంఘాల నేతలు చేరిన వారిలో ఉన్నారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పాటిల్, వీరశైవ లింగాయాత్ కుల గురువులు శివాచార్య స్వాములు, మణికంఠ శివాచార్య స్వాములు, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్ నర్సింహులు, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, వీరశైవ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు వజ్రలింగం, అధ్యక్షుడు పోకల శివుడు, కార్యదర్శి శంకర్లింగం, కోశాధికారి శర్వన్న, శెట్టి చంద్రశేఖర్, రాజసింహుడు, చంద్రశేఖర్, నాగభూషణం, కౌన్సిలర్ సురేందర్, నాయకులు పాల్గొన్నారు.