జడ్చర్ల టౌన్, జూన్ 19 : శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వాన జడ్చర్లలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. ఆకాల వర్షం దంచికొట్టగా.. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షంనీరు ఇండ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా రాజీవ్‌నగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, శివాజీ నగర్ కాలనీలోని పలు ఇండ్లల్లోకి నీరు చేరింది. దీంతో ఇండ్లల్లోని సామగ్రి తడిచి పాడయ్యాయి.
నీటిని తోడేసేందుకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అలాగే ఆలూర్ రైల్వేగేటు వద్దనున్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నల్లకుంట ప్రాంతంలో వరద నీటి ప్రవాహానికి చెరువు కట్ట తెగింది. పాతబజార్, కొత్తబజార్ ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో వరద నీటిని బయటకు తొలగించే చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ నాయకులు వారి వారి వార్డుల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు.
వెంకటేశ్వరకాలనీలో కౌన్సిలర్ శశికిరణ్, రాజీవ్‌నగర్‌లో కౌన్సిలర్ సతీశ్, 18వ వార్డులో టీఆర్ఎస్ నేత ఇఫ్తెకారొద్దీన్ ఆయా కాలనీలలో నిలిచిన వరద నీటిని బయటకు పంపేందుకు సహాయ చర్యలు చేపట్టారు. బాధితులకు ధైర్యం చెప్పారు. బాదేపల్లి పట్టణంలో బొడ్రాయి పండుగ రోజే అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదివారం ఉదయం నీటమునిగిన కాలనీల్లో పర్యటించారు. యుద్ధ ప్రాతిపదికన నీటిని తరలించే ప్రయత్నాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.