నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ పట్టణాలు గులాబీమయమయ్యాయి. శనివారం రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ యువ సారథి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రూ.వందలాది కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా కొల్లాపూర్ మండలం సింగోటం చెరువు నుంచి గోపాల్దిన్నె రిజర్వాయర్‌కు నీటిని అందించేందుకు రూ.147 కోట్లతో చేపట్టనున్న గ్రావిటీ కాల్వకు, బిజినేపల్లి మండలంలో రూ.76 కోట్లతో నిర్మించనున్న మార్కండేయ లిఫ్ట్‌నకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రెండు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. పర్యటన సజావుగా సాగేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
నాగర్‌కర్నూల్ జూన్ 17 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లాలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనున్నది. టీఆర్ఎస్ హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. దీంతో ప్రజల్లో టీఆర్ఎస్కు తిరుగులేని ఆదరణ లభిస్తున్నది. ముఖ్యంగా జిల్లాగా ఏర్పాటవడంతో కలెక్టరేట్, పోలీసు, మెడికల్, నర్సింగ్, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పెండింగ్‌లో ఉన్న ఎంజీకేఎల్ఐ ప్రారంభమైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, దళితబంధు, రైతుబంధు, పింఛన్లు, రైతుబీమా, ఉచిత విద్యుత్, చేతివృత్తిదారులకు రాయితీ వంటి పథకాలు పేదల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశాయి. గ్రామాల్లోనూ రహదారులు ఏర్పాటవడంతో రియల్ రంగం పరుగులు తీస్తున్నది.
వ్యవసాయ, నివాస స్థలాల విలువలు రెట్టింపయ్యాయి. బీడు భూములు పచ్చగా మారి వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో సాగుతున్నది. ఈ క్రమంలో విస్తృతంగా అమలవుతున్న పథకాలతో చేపట్టిన, చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం అంకురార్పణ చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొల్లాపూర్‌లో, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కొల్లాపూర్, బిజినేపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులుతోపాటు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు హాజరుకానున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్, ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
నాగర్‌కర్నూల్, జూన్ 17 : నాగర్‌కర్నూల్ జిల్లా లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కొల్లాపూర్ నుంచి హెలీక్యాప్టర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఎస్పీ ఆఫీస్ వెనుక ఉన్న హెలీప్యాడ్ వద్ద ల్యాండింగ్ కా నున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఘన స్వాగతం పలకనున్నారు. 3 గంటలకు కొల్లాపూర్ చౌరస్తా వద్ద సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం, ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి శంకుస్థాపన, 3:15 గంటలకు పాత గోదాం వద్ద జిల్లా గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన, 3:30 గంటలకు కేసరి సముద్రం చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ పైలాన్, జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 4 గంటలకు రైతుబజార్ వద్ద ని ర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణాలకు, 4:15 గంటలకు కలెక్టరేట్ వద్ద మిషన్ భగీరథ, 4:30కు పాత మార్కెట్ యార్డు వద్ద టౌన్‌హాల్, వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, సాయంత్రం 4:45 గంటలకు మున్సిపల్ కార్యాలయం ప్రారంభించి.., 5 నుంచి 5:15 గం టల వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మం త్రి కేటీఆర్ చేరుకోనున్నారు.
5:30 గంటలకు బిజినేపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 5:40 గంటలకు బిజినేపల్లిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్, జ్యోతిబాఫూలే విగ్రహాలకు పూలమాల వేయనున్నారు. 6 గంటలకు శాయిన్‌పల్లి సమీపంలోని మార్కండేయ ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన అ నంతరం 6:45 గంటలకు బిజినేపల్లిలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు.
సీఎం కేసీఆర్ వల్లే అభివృద్ధి..
మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలంతా తరలిరావాలి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే రైతులు, సామాన్యులకు న్యాయం జరుగుతున్నది. బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలి.
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
అభివృద్ధికి కట్టుబడి ఉన్నా..
కొల్లాపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. ఎవరెన్ని విమర్శలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తా. సీఎం కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ప్రాజెక్టు పనులు, నియోజకవర్గంలో సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. ప్రజలంతా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొల్లాపూర్