వనపర్తి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దీంతో ప్రపంచ ప్రమాణాలను అందుకోవడం వీలవుతుందని సూచించారు. శుక్రవారం వనపర్తి గిరిజన ఫ్రూట్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ కస్టమ్స్ హైరింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్ఫాదకత పెరిగినప్పుడే అంతర్జాతీయంగా పోటీనీ తట్టుకుని నిలబడుతామని అభిప్రాయపడ్డారు. ఇదే దిశలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల కమతాలు పెద్దవని, మన దేశంలో ఉన్న కమతాలు చిన్నవని, దానికి అనుగుణంగా వ్యవసాయ పరికరాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా జలసిరులే సంతరించుకున్నాయని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తూ అగ్రగ్రామిగా తెలంగాణ కొనసాగుతుందని వివరించారు. భవిష్యత్ తెలంగాణ చాలా బాగుంటుందని చెప్పారు. వ్యవసాయానికి అద్దె యంత్రాలను గిరిజనులకు సంక్షేమ సంస్థ సాయం చేసిందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం రూ.23.44 లక్షలు విడుదల చేశామని స్పష్టం చేశారు. ట్రాక్టర్, రొటోవేటర్, ఐదు పవర్ టిల్లర్లు లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. గిరిజనలు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ మండట యూత్ ప్రెసిడెంట్ చిట్యాల రాము, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, సర్పంచ్ మాధవరెడ్డి, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు జోహెబ్, నాయకుడు పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.