అచ్చంపేట, జూన్ 10 : నల్లమల అటవీ ప్రాంతంలో నివాసం ఉంటు న్న కొమ్మన్పెంట ఆదివాసీ గిరిజనులు గోస పడుతున్నారు. కొమ్మన్పెంటకు వెళ్లాలంటే చెంచులు నరకయాతన అనుభవిస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్‌పోస్టు నుంచి నల్లమల అడవిలోకి కొద్దిదూరం వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమవైపు దారి గుండా కొమ్మన్పెంటకు దాదాపు 18 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ దారి అంతా గుంతలు, రాళ్లు, రప్పలతో ఉండడంతో రెండు గంటల సమయం పడుతున్నది. ఈ పెంటలో 32 చెంచు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. పెంటలో ఎలాంటి వాహనాలు లేవు. అత్యవసర సమయంలో దవాఖానకు వెళ్లాలంటే నరకయాతనే. పెంట నుంచి సెల్‌ఫోన్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి.. మన్ననూర్, అమ్రాబాద్‌లోని జీపు డ్రైవర్లకు ఫోన్ చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. వాళ్లు వచ్చేలోగా చెంచులకు ఏమైనా జరిగితే పట్టించుకునే వారే లేరు. ఒకవేళ వాహనం రాకపోతే నలుగురు వ్యక్తులు జోలె కట్టి వీపుపైన అమ్రాబాద్‌కు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
కొమ్మన్పెంట అమ్రాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఈ పెంటకు రోడ్డు వేసేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదు. దట్టమైన అటవీప్రాంతంలో చెంచులు నివాసం ఉంటున్నారని, రోడ్డు వేస్తే రాకపోకలు పెరిగి వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని అటవీశాఖ వాదన. ఇదిలా ఉండగా, కొమ్మన్పెంట గిరిజనులు ప్రతినెలా రేషన్ బియ్యం కోసం అమ్రాబాద్‌కు వెళ్తుంటారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం వెళ్లి సరుకులు తీసుకెళ్తుంటారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. డీలర్లు 30 కిలోలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పెంటలో ఇంక చాలా మందికి రేషన్, ఆధార్‌కార్డులు లేవు. పెంటలో అంబులెన్స్ ఉండేలా చూడాలని, వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్ ఇవ్వాలని కోరుతున్నారు. ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయంతోపాటు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంటునారు. సోలార్ బోరు మోటార్లు ఏర్పాటు చేసి.. ట్యాంకు ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు. అయితే, పైపులైన్ లీకేజీ అవుతుందంటూ వాపోతున్నారు. పెంటలో నీటితొట్టి నిర్మిస్తే.. సోలార్ పనిచేయని సమయంలో ఆ నీటిని వాడుకునే అవకాశం ఉంటుదంటున్నారు.

బియ్యం తక్కువ ఇస్తున్నారు..
కొమ్మన్పెంటలో కొందరికి అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఇంతకుముందు కార్డుకు 35 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు. డీలర్‌ను అడిగితే అంతే అని పంపిస్తున్నాడు. పెంటలో కొందరికి కొత్తగా పెండ్లిళ్లయ్యాయి. వారికి ఎలాంటి ఆధారం లేదు. కార్డులు లేవు. కొందరికి ఆధార్ కార్డులు కూడా లేవు. ప్రతి నెలా రేషన్ బియ్యం సరిపోక కొనుకొచ్చి తింటున్నాము. తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలి.
– అంజమ్మ, చెంచు మహిళ, కొమ్మన్పెంట
వాహనం ఇస్తే తలుచుకుంటాం..
అత్యవసర సమయం లో దవాఖానకు వెళ్లాలం టే తిప్పలు పడుతున్నాం. ఏదైనా వాహనం సమకూరిస్తే తలుచుకుంటాం. రోడ్డు బాగాలేదు. జీపు, బండ్లు తప్పా ఏవీ రావు. ఏదైనా ఆపద వస్తే అడవిగుండా నడుచుకుంటూ అడ్డంగా అమ్రాబాద్‌కు వెళ్తాం. ఆర్టీడీ సంస్థ ఇండ్లు కట్టిస్తమంటే.. అటవీ శాఖ వాళ్లు పర్మీషన్ ఇస్తలేరు. వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్ ఇవ్వాలి. – అంజయ్య, కొమ్మన్పెంట