నాగర్‌కర్నూల్ జిల్లాలో సం‘పత్తి’ పెరిగింది. తెలంగాణ ఆవిర్భావం మొదలు ప్రతి వానకాలం సీజన్లో తెల్లబంగారం సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలోనే ఇక్కడి పత్తికి డిమాండ్ ఉండడంతో సాగుపై రైతన్న ఆసక్తి కనబర్చుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం వ్యవసాయానికి వివిధ పథకాలతో ఊతం ఇస్తుండడం.. అలాగే జిల్లాలోని నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం కలిసి వస్తున్నది. దీంతో ఈ సీజన్లో 6,35,602 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానుండగా.. 4,40,932 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ అధికారుల అంచనా. జిల్లా ఏర్పడిన 2016లో 1.67 లక్షల ఎకరాలతో మొదలవగా..దాదాపు మూడు రెట్లు పంట సాగు విస్తీర్ణం పెరిగింది. అందుకే రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంతో కాటన్‌కు కేరాఫ్‌గా మారింది.
నాగర్‌కర్నూల్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా రైతన్నలు పత్తి సాగులో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సీజన్లోనూ సాగు రెట్టింపవుతున్నది. ప్రపంచ మార్కెట్లో పత్తికి అధిక డిమాం డ్ ఉన్నది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ పత్తి సాగును గణనీయంగా చేపడుతూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక స ర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సేద్యానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. రైతుబంధు, నిరంతర ఉచిత విద్యుత్, పెండింగ్ ప్రాజెక్టుగా ఉన్న ఎంజీకేఎల్ఐ పూర్తి, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం వంటి చర్యలతో సేద్యం సంబురంగా సాగుతున్నది. కాగా, జిల్లా లో రైతన్నలు పత్తి పంట సాగుకు అత్యధిక ప్రా ధాన్యత ఇస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానాన్ని తీసుకొస్తున్నారు.
జిల్లాలోని నేలలు పత్తికి అనుకూలంగా ఉండడం కూడా కలిసివస్తున్నది. ఉమ్మడి పాలమూరులో నాగర్‌కర్నూల్ జిల్లాలోనే అత్యధికంగా పత్తి సాగవుతుండడం గమనార్హం. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాల్లో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండడంతో త్వరలోనే తొలకరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఇప్పటికే రైతు లు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురిసి నేలలో చల్లదనం ఏర్పడిన వెంటనే విత్తనాలు విత్తనున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరించడంతో గత సీజన్లో రాష్ట్రమే సేకరించింది. దీంతో వరితో ఎదురయ్యే ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, వ్యవసాయ శాఖల సూచనలతో రైతులు వరి సాగును తగ్గించుకోనున్నారు. గత సీజన్లో జిల్లాలో 1.50 లక్షల వరి సాగైతే.. ఈసారి 1.10 లక్షలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. దాదాపుగా 25 శాతం వరి తగ్గే అవకాశమున్నది. గతేడాది పత్తి క్వింటాకు రూ. 10వేల వరకు ధర పలికింది.

ఈ నేపథ్యంలో రైతులు పత్తిని ప్రత్యామ్నాయ పంటగా భావిస్తున్నారు. పత్తి సాగు, దిగుబడి పెరగడంతో జిల్లా లో నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో కొత్తగా మిల్లు లు కూడా ఏర్పడ్డాయి. సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేయడంతో రైతులు వరి, ఇతర పంటలకన్నా పత్తే నయమని భావిస్తున్నారు. ఈ కారణంగా జిల్లాగా ఏర్పడిన 2016 నుంచి వ్యవసాయ శాఖ నమోదు చేసిన వివరాలను చూస్తే ప్రతి సీ జన్‌లో పత్తి సాగు పెరుగుతూనే ఉన్నది. 2016లో 1,67,403 ఎకరాలుండగా ఈ ఏడాది 4,40,932 ఎకరాలు కావడం విశే షం. మొత్తమ్మీద నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ సీజన్లో 6.35 లక్షల ఎకరాల సా ధారణ సాగులో పత్తి 4.40 లక్షలు, వరి 1.10 లక్షలు, కంది, ఇతర పం టలు 35 వేల ఎకరాలు మాత్రమే ఉన్నాయి.
2016లో 1,67,403 ఎకరా లు, 2017లో 3,17,523, 2018లో 2,97,648, 2019లో 3,63,718, 2020లో 4,56,959, 2021లో 3,52,593 , 2022లో 4,40,9 32 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. దీ న్ని బట్టి జిల్లాలో పత్తికి రైతుల ప్రాధాన్యత స్పష్టమవుతున్నది.
ఏడాదికేడాది పెరుగుతున్న పత్తి సాగు
నాగర్‌కర్నూల్ జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏడాదికేడాది పత్తి సాగు పెరుగుతున్నది. ఈ సీజన్లో సాధారణ సాగు6.35 లక్షల ఎకరాలకుగానూ 4.40 లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి సాగయ్యే అవకాశం ఉన్నది. రైతులు నకిలీ విత్తనాలు వేయకుండా ప్రభుత్వం గుర్తించిన విత్తనాలనే విత్తుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు పంటల సాగు చేయాలి.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్