అయిజ, జూన్ 7 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ శివశంకర్‌గౌడ్ కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 3, 4 గంటల మధ్య మేడికొండకు చెందిన శాస్త్రి చిన్న ఈశ్వర్ (35) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. పులికల్, మేడికొండ గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు టాటా సుమోతో ఢీకొట్టారు. రోడ్డు పక్కన పడిన ఈశ్వర్‌పై మారణాయుధాలతో దాడి చేసి విచక్షణారహితంగా నరికారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎస్సై నరేశ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలతో పాటు వివరాలు సేకరించారు. అయితే గతంలో జరిగిన హత్యలతో ఈశ్వర్‌కు సంబంధం ఉందని, ప్రస్తుతం జరిగిన హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గద్వాల దవాఖానకు తరలించారు. హత్యతో మేడికొండలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.