మహబూబ్‌నగర్, జూన్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణగా ఉండేలా చేసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు క్రీడలు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో రూ.4 లక్షల75వేల వ్యయంతో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. అనంతరం కబడ్డీ ప్రాంగణంలోకి చిన్నారులను పిలిచి కబడ్డీ ఆడించారు. చక్కగా రాణించిన చిన్నారులను శాలువాలతో సన్మానించి అభినందించారు. రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీని తీసుకొచ్చి అన్ని క్రీడల్లో సీఎం కప్‌ను కూడా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి సుడిగాలి పర్యటన..
పల్లె ప్రగతి, మన ఊరు-మన బడి కార్యక్రమాల కోసం మంత్రి మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రామచంద్రాపూర్, మాచన్‌పల్లి, పోతన్‌పల్లి, కోటకదిర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మాచన్పల్లిలో రూ.4.75లక్షలతో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అక్కడే రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను, రూ.10 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. పోతన్పల్లిలో రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.22 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, కోటకదిర గ్రామంలో రూ.30లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.15లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు, రూ.5లక్షలతో చేపట్టిన వెల్నెస్ సెంటర్, రూ.3లక్షలతో చేపట్టిన పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో కలియతిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మూడు నెలల్లో కొత్త పింఛన్లు
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒక్క పోతన్‌పల్లి గ్రామంలోనే రూ. 4కోట్ల70లక్షల 95వేలు పింఛన్ రూపంలో ఇచ్చామని, ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు గ్రామాభివృద్ధికి కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదన్నారు. రైతుబంధు కింద రైతులకు రూ.8కోట్ల46లక్షలు, చనిపోయిన 23మంది రైతు కుటుంబాలకు రైతుబీమా కింద రూ.కోటీ 15లక్షలు ఇచ్చామని వెల్లడించారు. కల్యాణలక్ష్మి పథకం కింద 43మంది లబ్ధిదారులకు రూ.43లక్షల 43వేలు ఇచ్చినట్లు తెలిపారు. పింఛన్ లేని వారందరికీ మూడు, నాలుగు నెలల్లో పింఛన్లు ఇస్తామని, ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు లేని గ్రామాల్లో సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు రూ.మూడు లక్షల సాయం అందిస్తామని తెలిపారు. మంత్రి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కే .సీతారామారావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ అనిత, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, పోతన్‌పల్లి సర్పంచ్ సత్యమ్మ, మాచన్‌పల్లి సర్పంచ్ మల్లికార్జునరెడ్డి, కోటకదిర సర్పంచ్ రమ్యాదేవేందర్రెడ్డి ఉన్నారు.
ఐలాండ్, బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 7: మినీట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బైక్‌పై వెళ్లి మినీట్యాంక్‌బండ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పెద్ద చెరువులో పూడికతీత పనులను వేగవంతం చేయాలన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, కౌన్సిలర్లు రామ్, ముస్తాక్, కట్టా రవికిషన్‌రెడ్డి, షబ్బీర్, నాయకులు శాంతయ్య, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.