మహబూబ్‌నగర్ టౌన్/వనపర్తి టౌన్, జూన్ 5: బడిబాట కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. ఈనెలాఖరు వరకు కార్యక్రమం కొనసాగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం చదువులతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనుండగా బడులకు కొత్తకళ రానున్నది. గతంలో ప్రభుత్వ పాఠశాలలంటే శిథిలావస్థలో భవనాలు..కూలిపోతున్న పైకప్పులతో దర్శనమిచ్చేవి. సర్కారు విద్యకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో కిచెన్షెడ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, కొత్తభవనాలు, ప్రహరీ నిర్మాణాలు, డిజిటల్ తరగతులు వంటి మౌలిక సదుపాయలు సమకూరనున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక, ఆంగ్లవిద్య అందుబాటులో లేక ఇప్పటికే చాలా మంది పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. అలాంటివారికి సీఎం కేసీఆర్ నిర్ణయంతో ముఖ్యంగా పేదలకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో భారీగా ప్రవేశాలు పెరుగుతున్నాయి.
వనపర్తి జిల్లాలో..
ప్రైవేట్ పాఠశాలల్లో అధునాతమైన హంగులు, ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులు రంగురంగుల ఫ్లెక్సీలు, కరపత్రాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. దానికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ యంత్రాంగం ఇంటింటికీ తిరిగి ఆంగ్ల విద్య, నాణ్యమైన విద్యను పాఠశాలల్లో అందిస్తున్నామని విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి తమ సొంత నిధులతో స్వయంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోర్డులను ఇప్పటికే ఏర్పాటు చేసి ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు డిజిటల్ వనరులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బడిబాట ప్రారంభమైన మొదటి రోజే 229 మంది విద్యార్థులు పాఠశాలల్లో నమోదయ్యారు. రెండో రోజు బడి బాటలో 125 మంది విద్యార్థులు నమోదయ్యారు.
లక్ష్యాలు ఇలా..
మహబూబ్‌నగర్ జిల్లాలో..
జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, కేజీబీవీ, బీసీ, నవోదయ, సాంఘీక సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, గిరిజన, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలలో, అర్బన్ గురుకులాలు కలిపి మొత్తం 876 పాఠశాలలున్నాయి. వీటిలో 80 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 291మంది విద్యార్థులను పాఠశాలల్లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
మహత్తర పథకం
‘మన ఊరు-మన బడి’ పథకం మహత్తరమైంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, వనరులు, వసతుల కల్పన మార్పు జరిగింది. బడిబాటలో తల్లిదండ్రులకు వివరించి అర్థం చేయించగలిగాం. ఈఏడాది 1-8 వరకు ద్విభాషలో పాఠ్య పుస్తకాలు రానున్నాయి. జిల్లావ్యాప్తంగా 518 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యను అందించనున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేపడుతున్నాం.
– రవీందర్, డీఈవో, వనపర్తి
అడ్మిషన్లు పెరిగే అవకాశం..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 30వ వరకు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పలుశాఖల అధికారులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించనున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తాం.
– ఉషారాణి, డీఈవో, మహబూబ్‌నగర్