మహబూబ్‌నగర్, జూన్ 5: ప్రతి ఒక్కరి జీవితానికి సొంత ఇల్లు ఒక కల. ఆ కలను నిజం చేస్తూ సర్కార్ పేదలకు డబుల్ బెడ్రూం అందిస్తున్నది. ఇంట్లో ఒక్కరు ఉన్నా సరే అర్హులనే లబ్ధిదారులను చేస్తున్నది. ఇల్లు ఉంటే ఏదో ఒక పనిచేసుకొని జీవనం సాగిస్తామనే భరోసా ఉంటుందని చెబుతున్నారు. చాలీచాలని జీతాలు, కూలి డబ్బులతో జీవనం గడిచేదే కష్టతరంగా మారిన తరుణంలో ఇల్లు కట్టుకోవడం అనేది తలకు మించిన భారం. అలాంటి భారాన్ని పేదల ముంగిట తీసుకొస్తూ వారికలను సాకారం చేసింది సర్కార్. దేవరకద్ర నియోజకవర్గంలోని అమిస్తాపూర్ గ్రామంలో రోడ్డు విస్తరణతో కొంత మంది తమ ఇండ్లతోపాటు జాగలను కూడా కోల్పోయారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పందించి ఇండ్లు పోయిన వారికి డబుల్బెడ్రూం అందించేందుకు చర్యలు తీసుకొన్నారు. సిద్ధాయిపల్లి వద్ద నిర్మించిన 288ఇండ్లను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈమేరకు అపార్ట్మెంట్ తరహాలో విశాలమైన ప్రదేశంలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించడంతో సంబురపడుతున్నారు.
నా జన్మధన్యమైంది..
మాది అమిస్తాపూర్ గ్రామం. ఇల్లు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ప్రభుత్వం నుంచి సొంత ఇల్లు ఎప్పుడు వస్తుందో అని చాలా నిరీక్షించాను. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి మాకు ఇల్లు ఇవ్వడం సంతోషంగా ఉంది. కేటీఆర్ సార్ బాగున్నావా.. అంటూ ఆప్యాయంగా పలకరించడం నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా జన్మ ధన్యమైంది.
– మమత, అమిస్తాపూర్
చాలా ఇబ్బందులు పడ్డాం…
ఉన్న ఇల్లు చాలా రోజుల కిందటే రోడ్డు విస్తరణలో పోయింది. అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఒకే రూంలో జీవనం సాగించాం. ఇంత త్వరగా ఇల్లు కట్టంచి ఇస్తారు అనుకోలేదు. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు ప్రభుత్వం సొంత ఇల్లుకట్టి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.
– శివాజీ, అమిస్తాపూర్
ఇల్లు వస్తదనుకోలే..
డబుల్బెడ్రూం ఇస్తామని చెప్పినప్పుడు అసలు నమ్మలేదు. మాది అమిస్తాపూర్ గ్రామం. రోడ్డు విస్తరణలో మా ఇల్లుజాగ పోయింది. ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు. ఇల్లు వస్తుందా..ఎప్పుడో అనుకున్నాం. ఇంత మంచి ఇల్లు ఇంత త్వరగా నిర్మించి ఇచ్చినందుకు ధన్యవాదాలు.
– శ్రీశైలం, అమిస్తాపూర్, దేవరకద్ర నియోజకవర్గం
సీఎం సారుకు రుణపడి ఉంటాం
ఇండ్లు ఇచ్చేందుకుగాను చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎవరూ కూడా రోడ్డు విస్తరణలో జాగ పోయినవారికి ఇల్లు ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– జాకీర్ హుస్సేన్, అమిస్తాపూర్, దేవరకద్ర నియోజకవర్గం