న్యూఢిల్లీ: సుమారు 3.25 లక్షల కోట్లతో దాదాపు 114 రఫేల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేయనున్నారు. భారతీయ వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంలో భాగంగా ఫ్రాన్స్‌తో ఈ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రక్షణ శాఖ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మరికొన్ని రోజుల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్‌పై సంతకాలు చేయనున్నారు. ఒకవేళ ఆ ఒప్పందానికి క్లియరెన్స్ దక్కితే, ఆయుధాలను సమకూర్చుకునే ప్రక్రియలోనే ఇది అతిపెద్ద డీల్ కానున్నది. సుమారు వంద వరకు రఫేల్ యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారు చేసే రీతిలో డీల్ కుదరనున్నది. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా హైగ్రేడ్ ఫైటర్ జెట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయనున్నారు.
ఇండియా వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. 2024 డిసెంబర్లో సీ వేరియంట్‌కు చెందిన చివరి డెలివరీని భారత్ అందుకున్నది. ఆ తర్వాత 26 నావెల్ ఏరియంట్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది. ఎం వర్షన్‌కు చెందిన ఆ యుద్ధ విమానాలను నౌకాదళం సుమారు 63 వేల కోట్లు ఖర్చుతో కొనేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎంఆర్వో.. మెయింటేనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ అగ్రిమెంట్లో భాగంగా నాలుగు ట్విన్ సీట్ ట్రైనర్ విమానాలను కూడా ఖరీదు చేశారు. ఎం వర్షన్‌కు చెందిన రఫేల్స్‌ను .. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలపై మోహరించనున్నారు.
సీ వర్షన్‌కు చెందిన జెట్స్ ఇప్పటికే అంబాలాలో నెంబర్ 17 స్క్వాడ్రన్, బెంగాల్‌లోని హసిమారాకు చెందిన నెంబర్ 101ఫాల్కన్స్ వద్ద మోహరించారు. రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటికే పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో వాటిని ఐఏఎఫ్ ఫైటర్లు వాడారు. ఆ ఆపరేషన్ సమయంలో స్కాల్ప్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ మిస్సైళ్లను వదిలినట్లు తెలిసింది. రఫేల్ యుద్ధ విమానాలు పలురకాల క్షిపణులను ప్రయోగించగలవు. ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ మెటియోర్, స్ట్రయిక్ వెపన్ హమ్మర్, అత్యాధునిక ఈ-వార్ఫేర్ సూట్ స్పెక్ట్రా, అడ్వాన్స్డ్ రేడార్, టార్గెటింగ్ సిస్టమ్స్ వీటిల్లో ఉన్నాయి.
హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీలో ఫైటర్ జెట్‌కు చెందిన కొన్ని పరికరాలను ఉత్పత్తి చేయనున్నారు. అయితే చివరి దశ అసెంబ్లింగ్ మాత్రం మెరిగ్నాక్లో ఉన్న డసాల్ట్ ఉత్పత్తి కేంద్రంలో జరగనున్నది.