మహబూబ్‌నగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మొదట దేవరకద్ర నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరుకానున్నారు. ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములుతోపాటు జెడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ (సిద్దాయపల్లి) వద్ద కేటీఆర్ చేతుల మీదుగా ఒకేచోట 288 డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. హెలిక్యాప్టర్ ద్వారా వస్తున్న మంత్రులు మొదట దేవరకద్ర నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగసభలో పాల్గొని అనంతరం కోస్గి పట్టణానికి వెళ్లనున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు.
దేవరకద్రలో పరుగులు పెడుతున్న అభివృద్ధి
దేవరకద్ర నియోజకవర్గం అంటే అభివృద్ధికి చిరునామాగా మారింది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో దూసుకుపోతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్‌తో నియోజకవర్గం మొత్తం సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోయిల్ సాగర్, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి వనరులు భారీగా పెరిగాయి. దానికి తోడు రెండు పెద్ద వాగులపై 21చెక్‌డ్యాంలు నిర్మించి వేలాది ఎకరాల ఆయకట్టు వచ్చేలా చేశారు. చెక్‌డ్యాంల విభాగంలో తొలిసారి స్కోచ్ అవార్డును అందుకున్న ఘనత నియోజకవర్గానికే తగ్గింది. ఇక మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. ఇప్పటికే 1400డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రవేశాలు జరుగగా.. మరో 1100ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. అన్ని గ్రామాలకు రోడ్లు వేయడంతోపాటు పలు చోట్ల బ్రిడ్జీల నిర్మాణంతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపించారు. కొత్తగా ఏర్పడిన భూత్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధికి చిరునామాగా మార్చారు. ఎమ్మెల్యే ఆల సహకారంతో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ (సిద్దాయపల్లి)లో ఒకేచోట 288డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి శనివారం మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయించనున్నారు.

కోస్గిపై ప్రత్యేక దృష్టి
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్థానికులు డిమాండ్ చేస్తున్న బస్‌డిపో ఎట్టకేలకు సాకారం అవుతున్నది. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చొరవతో డిపో ఏర్పాటైంది. శనివారం మంత్రులు డిపోను జాతికి అంకితం చేస్తారు. పాతబస్టాండ్ స్థానంలో నిర్మించిన కొత్త బస్టాండును ప్రారంభించనున్నారు. అదేవిధంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ ప్రారంభిస్తారు. కోస్గిలో సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో మంత్రులు ప్రసంగిస్తారు. అనంతరం హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరిగివెళ్తారు. కోస్గి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన పర్యవేక్షించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు