జాగారం అంటేనే శివనామ స్మరణతో గడపడం. మనసును భక్తిలో నిమగ్నం చేయడం. అయితే, ఆలయాలకు వెళ్లడం, పురాణ కాలక్షేపాలు చేయడం.. కొందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటివారంతా ఇంట్లోనే టీవీలు చూస్తూ జాగారం చేయవచ్చు. ఓటీటీ వేదికగా అద్భుతమైన పౌరాణిక, భక్తిరస సినిమాలను వీక్షించవచ్చు. ఆయా సినిమాలు చూస్తూ.. శివరాత్రి పుణ్యదినాన శివతత్వాన్ని, శైవ క్షేత్రాల మహిమలను తెలుసుకోవచ్చు.
భక్త కన్నప్ప : దేవుడికి కావాల్సింది శాస్ర్తోక్తమైన పూజ కాదు. స్వచ్ఛమైన ప్రేమ అని చాటిచెప్పే చిత్రం. రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తిన్నడిగా నట విశ్వరూపం చూపించారు. బాపు దర్శకత్వంలో 1976లో వచ్చిన భక్త కన్నప్ప.. తెలుగు సినీచరిత్రలోనే గొప్ప భక్తిరస చిత్రంగా మన్ననలు అందుకున్నది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది.
భూకైలాస్ : శివరాత్రికి మూలమైన లింగోద్భవ గాథను వివరించే సినిమా. రావణాసురుడిగా ఎన్టీయార్ నటన, శివుడిగా నాగభూషణం ఆహార్యం.. ఈ సినిమాను భక్తిరస చిత్రాల్లో సాటిలేనిదిగా నిలబెట్టాయి. ఇందులో నారదుడిగా ఏయన్నార్ నటించడం మరో విశేషం. 1958లో వచ్చిన భూకైలాస్.. ఒక అద్భుతమైన కళాఖండంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. జాగారం సమయంలో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. యూట్యూబ్‌తోపాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఈ సినిమాను వీక్షించొచ్చు.
దక్షయజ్ఞం: శక్తి పీఠాల ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే.. దక్షయజ్ఞం చూడాల్సిందే! ఈ చిత్రానికి దర్శకుడు కడారు నాగభూషణం. శివుడిగా ఎన్టీయార్, దక్ష ప్రజాపతిగా ఎస్వీఆర్.. పోటీపడి నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సంభాషణలు, అహంకారానికి-ఆధ్యాత్మికతకు మధ్య జరిగే పోరాటం అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా, శివుడి తాండవం, సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు శివుడు ఆగ్రహంతో వీరభద్రుడిని సృష్టించే ఘట్టం మంత్రముగ్ధులను చేస్తాయి. యూట్యూబ్‌తోపాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఈ సినిమాను వీక్షించొచ్చు.
శ్రీ మంజునాథ: ఆధునిక కాలంలో వచ్చిన అద్భుతమైన సామాజిక-భక్తిరస చిత్రం. పరమశివుడిగా చిరంజీవి నటన, ఆహార్యం.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక శివభక్తుడైన మంజునాథుడిగా అర్జున్ అద్భుతంగా నటించాడు. భక్తిరస చిత్రాలకు కమర్షియల్ హంగులద్ది తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈటీవి విన్తోపాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతున్నది.
శ్రీకాళహస్తి మహాత్మ్యం: శ్రీకాళహస్తి క్షేత్ర ప్రాముఖ్యతను, తిన్నడి భక్తిని ఎంతో హృద్యంగా చూపిస్తుందీ చిత్రం. ఈ సినిమాలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటన.. అభిమానులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటలో ఉన్నది.
.. వీటితోపాటు ఎన్టీయార్ దర్శకత్వంలో 1961లో రూపొందిన ‘సీతారామ కళ్యాణం’ సినిమా కూడా క్లాసిక్ మాస్టర్‌పీస్. సీతారాముల కథే అయినా.. రావణుడి శివభక్తిని ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపించారు. ఇందులో రావణాసురుడిగా ఎన్టీయార్ అద్భుతమైన నటనతో మెప్పించారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రగా తెరకెక్కిన సినిమా.. జగద్గురు ఆదిశంకర. 2013లో విడుదలైన ఈ సినిమా.. శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.