వనపర్తి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రం లో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాతో కలిసి జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అమరులకు నివాళులర్పించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అవతరించి ఎనిమిదేండ్లు దాటి తొమ్మిదో వసంతంలోకి అడుగిడుతున్నదన్నారు.
గతం సృష్టించిన సమస్యల వలయంలోంచి బయట పడటమే కాకుండా నిరంతరం ప్ర గతిశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నదన్నారు. దశాబ్ద కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా ఆయన అభిప్రాయపడ్డారు. అనతి కాలంలోనే అద్భుత విజయాలను అందుకున్నదన్నా రు. వివిధ రంగాల్లో రాష్ట్రం చేస్తున్న ప్రగతి, అమలు చే స్తున్న పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అం దుతున్నట్లు చెప్పారు. ఎన్నో కార్యక్రమాలకు తెలంగాణ నాంది పలకడం ద్వారా దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. దీనికి జాతీయస్థాయి అవార్డులు గీటురాళ్లని అభివర్ణించారు.
వనపర్తి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం నాగవరం శివారులో 45 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఇటీవల రూ.17 కోట్లతో 180 పడకలతో గర్భిణీ, ప్రసవానంతర సేవలు, పుట్టిన బిడ్డల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్య కళాశాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వంద పడకల దవాఖానకు అనుసంధానంగా మూడు వందల పడకల వైద్యశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఘనపురం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం, బుద్ధారం రైట్ కెనాల్, కర్నెతండా ఎత్తిపోతల పథకం, పేరూర్ లిఫ్టు స్కీం, చెక్‌డ్యాంలు, చెరువుల ద్వారా జిల్లాను పూర్తిగా సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పునరావాసం కింద ఇప్పటివరకు రైతులకు రూ.208 కోట్లు నష్టపరిహారం అందించామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద చేస్తున్న భూసేకరణకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. దళితబంధు కింద మొదటి విడుతలో రూ.19.90 కోట్లు మంజూరు చేశామన్నారు. అనంతరం దళితబంధు యూనిట్ల కింద లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా, మున్సిపల్ చైర్మన్ గట్టు యాద వ్, వైస్ చైర్మన్ శ్రీధర్, అదనపు కలెక్టర్ సెంగ్వాన్, వే ణుగోపాల్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ కి చ్చారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.