నారాయణపేట టౌన్, జూన్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పతాకావిష్కరణకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి రానున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో స్టాళ్ల ఏర్పాటు బందోబస్తు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. పతాకావిష్కరణ అనంతరం స్టాళ్ల పరిశీలన, కలెక్టరేట్లో కవి సమ్మేళనం ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భరత్, ఆర్డీవో రాంచందర్‌నాయక్ పాల్గొన్నారు.
అట్టహాసంగా..
ఊట్కూర్, జూన్ 1: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకొనేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలను ముస్తాబుచేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో కాళప్ప, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ తిరుపతయ్య, పంచాయతీల సర్పంచులు, ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యాలయాలను రంగు రంగుల తోరణాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద జాతీయ పతకాలను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించాలని ఎంపీడీవో సూచించారు.
మక్తల్‌లో..
మక్తల్ టౌన్, జూన్ 1: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. మక్తల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 7:30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ పావని ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కణ ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కె నర్సింహ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.