మహబూబ్‌నగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తలాపునే కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా కనీసం తాగునీటికి నోచుకోని దౌర్భాగ్య స్థితి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలది. తాగునీరే లేనప్పుడు ఇక సాగునీరు ఏం లభిస్తుంది. వర్షాలు మొహం చాటేయడంతో కరువుతో జనం అల్లాడిపోయే దుస్థితి నెలకొని ఉన్న పరిస్థితులవి. ఈ నేపథ్యంలోనే సుమారు 14 లక్షల మంది మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముంబయి, పుణె, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఇండ్ల వద్ద ముసలోళ్లు, పిల్లలు తప్పా పెద్ద వాళ్లెవరూ కనిపించని విధంగా పరిస్థితి మారింది.
సమైక్య పాలనలో తెలంగాణ అణగారిపోయింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణపై సీమాంధ్రులు శీతకన్ను వేసి నిధులన్నింటినీ కోస్తా, రాయలసీమకు తరలించుకుపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా సాగునీరు అందించలేని దుస్థితి ఉండేది. రెండు పెద్ద నదులు ప్రవహిస్తున్నా.. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను ప్రారంభించి వదిలేసిన సమైక్య సర్కార్ పాలమూరుపై సవతి తల్లి ప్రేమ చూపించింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తిన ఉద్యమ నేత కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ప్రారంభించారు.
దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలో జూన్ 1, 2001న ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సమావేశంలో ఉద్యమ నేత కేసీఆర్ ఏం ప్రసంగిస్తారో వినేందుకు జిల్లా నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున పోగయ్యారు. ఎవరికి వారు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని, ఆర్టీసీ బస్సులు, రైళ్ల ద్వారా భారీగా తరలిరావడంతో మహబూబ్‌నగర్ కిటకిటలాడింది. ఈ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది.
నీళ్లు, నిధులు, నియామకాలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పేదరికానికి ప్రధాన కారణమైన సాగునీటి సమస్యను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమైక్య పాలకులు పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. దీంతో తెలంగాణకు ముందు కేవలం 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నేడు సుమారు 12 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేసింది. దీంతో వలసలు వెళ్లిన రైతులు తిరిగి సొంతూరి బాట పట్టారు. గ్రామాల్లో తిరిగి పండుగ వాతావరణం నెలకొంది. దీనికి తోడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ చెప్పేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందించింది. రైతులకు పంట పెట్టుబడిగా ఎకరాకు రూ.10వేలు అందించారు. దీంతో పడావు పడిన పాలమూరు బీడు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. ఎటు చూసినా పచ్చదనం పరుచుకుంటున్నది. ఇక తెలంగాణలోని నిరుద్యోగుల కోసం సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారు. దాంతో ఉద్యమ ప్రారంభంలో మహబూబ్‌నగర్ సభలో ఉద్యమ నేత ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఇచ్చిన హామీలన్నీ నేడు సాక్షాత్కారమవుతుంటే ఆ సంతోషమే వేరని ఉద్యమ నేతలు పేర్కొంటున్నారు. కేసీఆర్ ఒకసారి మాట ఇచ్చారంటే అందుకు తిరుగుండదని చెప్తున్నారు.

పేదరికానికి కారణమెవరు..?
కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా.. మహబూబ్‌నగర్ వెనుకబాటుకు కారణం ఎవరు..? 14 లక్షల మంది పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లేలా చేసిందెవరు..? ప్రాజెక్టుల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్న పార్టీలు.. పాలమూరుకు అన్యాయం చేశాయని ఉద్యమ నేత కేసీఆర్ గొంతెత్తారు. లక్షలాది క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఆంధ్రా పాలకులు కనీసం పట్టించుకోలేదని ఆ సభలో కేసీఆర్ పేర్కొన్నారు. కండ్ల ముందే నీళ్లు తరలిపోతుంటే అన్నదాత గుండె చెరువవుతున్న తీరును పాలమూరు ప్రజలకు గుర్తు చేశారు.
మన నీళ్లు, మన నిధులతోపాటు నియామకాలు కూడా చేసుకుంటే తెలంగాణ బంగారు తునక అవుతుందని స్పష్టం చేశారు. కృష్ణానదిని బీడు భూముల్లోకి మళ్లిస్తామని హామీ ఇచ్చారు. సమైక్య పాలమూరు అర్ధాంతరంగా ఆపేసిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించి వలసలను అరికడతామని రైతులకు భరోసా ఇచ్చారు. సమైక్య పాలకులు తెలంగాణను, పాలమూరును ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అసంపూర్తి పనులు చేసి వదిలేసిన తీరును వివరించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి పెండింగ్ ప్రాజెక్టులను అధికారంలోకి వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాజెక్టులుగా మారుస్తామన్నారు. తాగు, సాగునీటిని అందించడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రసంగంలోని మాటలపై జనం ఎంతో భరోసా ఉంచారు. అడుగడుగునా ఆయనకు అండగా ఉంటూ వచ్చారు. 2009లో ఉద్యమ నేత మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేస్తే ఘన విజయం కట్టబెట్టారు. దక్షిణ తెలంగాణలో, ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో తెలంగాణ వాదం లేదన్న వాళ్లకు చెంపపెట్టు సమాధానం ఇచ్చారు.
మహబూబ్‌నగర్‌లో జరిగిన తొలి బహిరంగ సభ తర్వాత 13 ఏండ్లకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మహబూబ్‌నగర్ ఎంపీగానే కేసీఆర్ తెలంగాణ సాధించారు. ఆ క్షణాలు ఎంతో మధురమైనవిగా నిలుస్తాయి. అయితే జూన్ 1, 2001న మహబూబ్‌నగర్‌లో జరిగిన తొలి బహిరంగ సభలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరడమే ఉద్యమ నేత ముందు చూపునకు, స్వరాష్ట్రంపై ఉన్న ప్రేమకు చిహ్నంగా పేర్కొనవచ్చు.
ప్రజల దరి చేరుతున్న నాటి ఉద్యమ ఫలాలు..
ఉమ్మడి పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అప్పటి పాలకులు సాగునీరు ఉన్నా.. కరెంట్ కోత ల కారణంగా కండ్ల ముందే పంటలు ఎండిపోయేవి. తా గునీటికి కూడా ఇబ్బందులు పడేవాళ్లం. ఉద్యోగాలు లేవు. ప్రజలు వలుసలు వెళ్లేవారు. ఈ క్రమంలో నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్య మం ఉవ్వెత్తున లేచింది. ఆనాటి ఉద్యమ ఫలితాలు నేడు ప్రజలు అనుభవిస్తున్నారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక సంతోషంగా గడుపుతున్నారు. పాలమూ రు పచ్చబడాలంటే ప్రత్యేక తెలంగాణే పరిష్కారమని కేసీఆర్ చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చాయి. సాగునీరందించేందుకు ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పథకం, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలతో ప్రజల సంక్షేమం చూస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు సాకారమయ్యాయి. అమరుల ఆకాంక్షలు నెరవేర్చడంతోపాటు సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశంలో తెలంగాణను నెంబర్‌వన్‌గా మార్చారు.
– విశ్వరూపం, తెలంగాణ ఉద్యమకారుడు, పెబ్బేరు