మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 31:శుభకార్యం జరిగి నెల రోజులు గడవక ముందే ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. కూతురి పెండ్లి ఎంతో వైభవంగా చేసిన కన్న తండ్రే తనయను, భార్యను హత్య చేశాడు. బిడ్డ కాపురానికి వెళ్లనని చెప్పడంతో మందలించాడు. వినకపోగా భార్య కూడా కూతురినిసమర్థించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. నిద్రపోతున్న ఇద్దరిపై దూలం కట్టెతో దాడి చేశాడు. రక్తపు మడుగులో వారు కొట్టుమిట్టాడుతుండగా తాపీగా బంధువులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. వారు వచ్చే లోగా అతడు కూడా పురుగుల మందు తాగాడు. ముగ్గురిని దవాఖానకు తరలించారు.ఇద్దరు మృతి చెందగా.. ఉన్మాది చికిత్స పొందుతున్న ఘటన మహబూబ్నగర్ మండలం జైనల్లీపూర్లో చోటు చేసుకున్నది
పళ్లైన 25 రోజులకే ఆ ఇంట్లో కట్టుకున్న భార్యను, కన్న కూతురును ఓ ఉన్మాదుడు దూలం కర్రతో కొట్టి చంపాడు. అనంతరం అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. మహబూబ్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్రావు కథనం మేరకు.. మండలంలోని జైనల్లీపూర్ గ్రామానికి చెందిన దెయ్యాల కృష్ణయ్య (50), భార్య కళావతమ్మ(45) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు.
రెండో కూతురు సరస్వతి(22)కి మే 8న మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. రూ.5 లక్షలు, 8 తులాల బంగారం, బైక్ ఇచ్చి కుటుంబ సభ్యులు వివాహం ఘనంగా జరిపారు. అయితే ఈ పెండ్లి తనకు ఇష్టం లేదని సరస్వతి తండ్రికి చెప్పినా బెదిరించి పెద్దల సమక్షంలో పెండ్లి చేశాడు. అత్తగారింటికి వెళ్లిన సరస్వతి గత నెల 25న తల్లిగారింటికి వచ్చింది. అత్తగారింటికి ఇక వెళ్లనని తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. కాపురానికి వెళ్లాల్సిందేనంటూ కూతురును తండ్రి మందలించాడు. ఈ విషయంలో కూతురుకి మద్దతుగా తల్లి కళావతమ్మ మాట్లాడింది.
సోమవారం రాత్రి మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణయ్య అదే రోజు అర్ధరాత్రి కుమార్తె సరస్వతి, భార్య కళావతమ్మ నిద్రిస్తుండగా.. ఇంటి దూలం కట్టెతో బలంగా కొట్టాడు. రక్తపు మడుగులో ఉన్న భార్య, కూతురును చూసి భయంతో అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. గ్రామానికి చేరుకున్న బంధువులు ముగ్గురిని మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తల్లీ, కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. కృష్ణయ్య మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపాడు.