బాలానగర్, మే 31: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నుంచి చేపట్టనున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం అవగాహన కల్పించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శలు బాధ్యతగా గ్రామాల్లో సౌకర్యాలు, వసతులు, కల్పించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. గ్రామాల్లో పరిసరాల శుభ్రత, హరితహారం, విద్యుత్ సమస్యలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లపై దిశా నిర్ధేశం చేశారు. సమావేశంలో ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో శ్రీదేవి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ వెంకట్రాములు, పంచాయతీ కార్యదర్శులు పాండు, అనిల్‌కుమార్, ఆంజనేయులు, దస్రురాథోడ్, లోక్‌నాథ్ ఉన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మే 31: ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. మండల అధికారులు, సర్పంచులతో మంగవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సర్పంచులు పల్లెప్రగతి సమీక్ష సమావేశానికి రాకపోవడంతో గ్రామాల ప్రత్యేకాధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నుంచి 18వ తేదీవరకు నిర్వహించనున్న పల్లెపగ్రతి కార్యక్రమాన్ని అన్నివర్గాలతో కలిసి విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు మండల ప్రత్యేకాధికారి బోయిన్పల్లి, వాడ్యాల్ గ్రామాల్లో క్రీడా మైదానాలను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీవో అనురాధ, ఏపీఎం రాజేందర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మే 31: ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ కదిరెశేఖర్రెడ్డి కోరారు. మండలంలోని సర్పంచులతో, అధికారులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పల్లెప్రగతిలో భాగం గా గ్రామాల్లో సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని కోరారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని, విద్యుత్ స్తంభాల కింద మొక్కలు నాటొద్దని విద్యుత్ అధికారులకు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవో మున్ని, ఎంపీవో విజయకుమార్, విద్యుత్ ఏఈ ప్రదీప్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రదీ ప్, సర్పంచులు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, మే 31: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయంతంగా నిర్వహించాలని మండల ప్రత్యేకాధికారి రాధారోహిణి సూచించారు. మండల మహిళా సమాఖ్య సమావేశం హాల్లో మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో పల్లెప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలంలో ప్రజలను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించేందుకు పల్లెప్రగతి కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. గ్రామంలోని పురవీధులు, ఖాళీస్థలాల్లో ఉండే చెత్తాచెదారం తొలగించడం వల్ల దోమలు, ఈగల ఉత్పత్తి తగ్గడంతో వ్యాధుల నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ కళావతికొండయ్య, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో సరోజ, ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి
దేవరకద్రరూరల్, మే 31: ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ‘పల్లెప్రగతి’ని చేపట్టిందని ఎంపీపీ రమాదేవి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులు, సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ శుక్రవారం నుంచి నిర్వహించనున్న పల్లెప్రగతిలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. పల్లెప్రగతి సమీక్షను మండలంలోని సర్పంచులు బహిష్కరించి నిరసన తెలిపారు.