మహబూబ్‌నగర్, మే 31: అభివృద్ధి అంటే ఇదీ అనే విధంగా మహబూబ్‌నగర్ రూపురేఖలు మార్చుకుంటూ ప్రగతి వైపు పరుగులు తీసేలా చేస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం రాత్రి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, సంబంధిత అధికారులతో కలిసి కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌లో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
పట్టణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.16కోట్ల వ్యయంతో ప్లాంట్ ఏర్పాటుకు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో తడి చెత్తను సేకరించి దాని ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. టన్ను తడి చెత్తకు రూ.150 మున్సిపాలిటీకీ చెల్లిస్తారని, ప్రతి రోజూ 40 నుంచి 50 టన్నుల చొప్పున చెత్తను సేకరిస్తే ఏడాదికి రూ.22 లక్షలు మున్సిపాలిటీకి వస్తాయన్నారు.
నూతన విధానాలకు శ్రీకారం చుట్టడంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ మరింత పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రెండెకరాల స్థలాన్ని కూడా తక్షణమే గుర్తించి ఇవ్వాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చెత్తను ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, ఇంటి వద్దకే వస్తున్న చెత్త తరలింపు వాహనాల్లో మాత్రమే వేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఎస్ రెడ్కో జిల్లా మేనేజర్ జేఎస్ఎన్ మూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్ కిశోర్ ఉన్నారు.