భూత్పూర్, మే 28 : రైతులే నిజమైన శాస్త్రవేత్తలని ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు పంటలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల సౌకర్యార్థం కొన్ని ప్రదర్శనలను ఏ ర్పాటు చేశారు. ముఖ్యంగా యంత్ర పరికరాలతో వ్యవసా యం, తక్కువ నీటితో పంటలను సాగుచేసే విధానం తెలియజేసే ప్రయోగాలను ప్రదర్శించారు. రైతులు పొలాన్ని బట్టి సాగుచేసే పద్ధతిని అలవాటు చేసుకోవాలని తెలిపారు.
పొలంలో భూసారం ఏ విధంగా ఉందని గుర్తించి వ్యవసాయాధికారులను సంప్రదించి పంటలను సాగుచేయాలన్నారు. విత్తనాలను ఎక్కడో కొనుక్కురాకుండా రైతులే స్వ యంగా విత్తనశుద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన పద్ధతులను తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీ అధ్యాపకురాలు పుష్పావతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వ్యవసాయ కూలీలు పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. అందరూ విధిగా యంత్రాలతో వ్యవసాయం చేసే పద్ధతులను అలవాటు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, డీఏవో వెంకటేశ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు రామకృష్ణ, అర్చన, సర్పంచ్ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, ఏడీఏ యశ్వంత్‌రావు, ఏవో మురళీధర్, ఉపసర్పంచ్ శ్రీశైలం, రైతులు పాల్గొన్నారు.