రాజాపూర్, మే 28 : మండలంలోని చొక్కంపేట గ్రామ పేదల సొం తింటి కల త్వరలోనే నెరవేరబోతున్నది. ఇండ్లులేక అవస్థలు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. సొంతింటి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ పూరిగుడిసెలు, పెంకుటింట్లో కాలం వెల్లదీస్తున్నవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు వరంలా మారాయి. ఇందులో భాగంగానే చొక్కంపేట గ్రామానికి మంజూరైన 32డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
మండలంలోని అన్ని గ్రామాలతో పోలిస్తే చొక్కంపేట గ్రామంలోనే అత్యధికంగా పూరిగుడిసెలు, పెంకుటిండ్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడి పేదల పరిస్థితులను చూసి ప్రజాప్రతినిధులు,నాయకులు,ప్రజల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామానికి మొదటి విడుతగా 32 ఇండ్లు మంజూరు చేశారు. రెండేండ్లుగా కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణ పనులు కొంత వరకు జాప్యం జరిగినా ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమయ్యాయి. డబుల్ బెడ్రూం మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని చొక్కంపేట గ్రామస్తులు అంటున్నారు.