మహబూబ్‌నగర్, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 10జిల్లాల తెలంగాణ ప్రస్తుతం 33జిల్లాల తెలంగాణగా రూపాంతరం చెందింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అయిదు జిల్లాలుగా విడిపోయింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రతి జిల్లా కేంద్రానికి ఒక నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, జాతీయ సమాచార కేంద్రం మంజూరూ చేయాల్సి ఉంది. 2016లో 31 జిల్లాలు, 2019లో నారాయణపేట, ములుగు జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కొత్త జిల్లాలు ఏర్పడి దాదాపు ఆరేళ్లు కావస్తున్నా… కేంద్రం మాత్రం ఈ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థలపై నేటికీ దృష్టి పెట్టడం లేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కేంద్ర విద్యాసంస్థలైన కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, ఎన్ఐసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా కేంద్రం కిమ్మనడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే కాకుండా రాష్ట్రంలోని ఏ ఇతర జిల్లాకు కూడ కేంద్ర సంస్థలను ఇవ్వలేదు. అయితే బడ్జెట్లో అవకాశం ఇవ్వలేదని మన ఎంపీలు మౌనంగా ఉండలేదు. మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కేంద్ర మంత్రులను కలిసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిలో మార్పు రావడం లేదు. అయితే పాదయాత్ర పేరిట ప్రజల వద్దకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కానీ, స్థానిక బీజేపీ నేతలు కానీ ఈ అంశంపై మాత్రం నోరు మెదపలేదు.
5 జిల్లాలు ఒకటే నవోదయ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమై దాదాపు ఆరేండ్లు కావస్తున్నా కనీసం కేంద్రం మాత్రం స్పందించడం లేదు. ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర విద్యా సంస్థలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న నవోదయ విద్యాలయం ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఉంది.
అంటే ఇక నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రత్యేకంగా నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మాత్రం నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో కేంద్రీయ విద్యాలయం నడుస్తోంది. మహబూబ్‌నగర్ మినహా మిగతా కొత్త జిల్లా కేంద్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో మాత్రమే ఉంది. వీటిని సైతం అన్ని జిల్లాలకు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు పార్లమెంట్లో ప్రస్తావించారు. మంత్రికి వ్యక్తిగతంగా వినతిపత్రం ఇచ్చారు. కానీ ఇంకా కేంద్రంలో చలనం లేదు.
వెనకబడిన ప్రాంతాలపై ప్రేమేది…
దేశంలోనే అక్షరాస్యతలో వెనకబడిన ప్రాంతాల్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం ఒకటి. గట్టులో పనిచేసేందుకు ఉపాధ్యాయులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. అంతటి మారుమూల ప్రాంతంలో విద్యావ్యవస్థ బాగు చేసేందుకు నవోదయ విద్యాలయాల వంటివి ప్రారంభిస్తే అక్కడి నిరుపేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్‌లో కార్పోరేట్ స్థాయి ఉచిత విద్యను అందించే నవోదయ విద్యాలయాలు నారాయణపేట లాంటి వెనకబడిన జిల్లాకు ఓ ఆక్సిజన్‌లా పనిచేస్తాయి. నిరుపేద గ్రామీణ విద్యార్థులకు ఈ విద్యాలయాలు వరంగా చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలో 4 నవోదయ, 4 కేంద్రీయ విద్యాలయాలు వస్తే వెనకబడిన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.
మహబూబ్‌నగర్ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు దగ్గరగా ఉన్నందున అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్ సర్వీసెస్‌లలో పనిచేసే వారు కూడా మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి పిల్లలకు విద్యాభ్యాసం కోసం కేంద్రీయ విద్యాలయాల అవసరం ఉంది. కేంద్రం ఇప్పటికైనా స్పందించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతమైన పాలమూరుకు అండగా ఉండి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకునే నినాదానికి న్యాయం చేయాలని పాలమూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.