హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక చర్యలను అధిగమించి బీఆర్ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియచేశారు. ఈ విజయం అభ్యర్థులదే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఓటర్లది అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ, ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని, గులాబీ జెండాను రెపరెపలాడించిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి బీఆర్ఎస్ రుణపడి ఉంటుందని అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అరాచకానికి పాల్పడిందని, ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఎక్స్ వేదికగా ఆయన దుయ్యబట్టారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గుంజుకుపోవడం పోలీసుల అరాచకాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజాపాలన అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థులపై దమనకాండ సాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్రామాలు ఆడినా, బీఆర్ఎస్ అభ్యర్థులపై ఎంత దమనకాండ సాగించినా, అంతిమ విజయం తమదేనని ఎర్రోళ్ల స్పష్టం చేశారు.