వనపర్తి, మే 23 : సాంకేతిక విజ్ఞానంతో ఎంతో సాధిస్తున్నప్పటికీ గ్రామాల్లో , పట్టణాల్లో ప్రజలు మూఢ నమ్మకాలను ఇంకా ఆచరిస్తున్నారు. ఎంతలా అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో పిల్లి బయటకు వచ్చిందంటే అపశకనం అని, నిమ్మకాయ పెట్టుకొని పోవాలని, గ్రామాలు, పట్టణాల్లో ఉన్న బాబాల దగ్గరకు వెళ్తే తమకున్న కష్టాలు మొత్తం తొలగిపోతాయని, వితంతువులు శుభకార్యాల్లో పాల్గొంటే అశుభం జరుగుతుందనే మాటలు వింటూనే ఉంటాం. ఇలాంటి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొంతమంది బాబాలుగా వేషాలు వేసుకొని ఇంట్లో సమస్యలు ఉన్నాయి.. మీరు చాలా కాలంగా బాధపడుతున్నారని, మీకు అరిష్టం ఉందని ఈ తాయత్తు కట్టుకుంటే, నేను ఇచ్చిన వస్తువులు మీ ఇంట్లో పెట్టుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయని ప్రజలను మోసం చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నారు. ఏదో అయ్యింది ఏవరో చేతబడి చేశారు.. అందుకే నాకు ఇలా అయ్యిందంటూ మీకు తెలిసిన వాళ్లు ఇలా చేశారు, అలా చేశారు వంటి మాటలను నమ్మిన వారు ఇంకొరిపై కోపం పెంచుకొని వారిని హతమార్చడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి, వారిపై జిల్లా పోలీసింగ్ కమ్యూనిటీ లైజనింగ్ అధికారి, ఆపై జిల్లా పోలీసింగ్ కమ్యూనిటీ అధికారిని నియమించారు. వీరంతా మండలం, పట్టణంలో తమ సిబ్బంది, కళాజాత బృందం ద్వారా మూఢనమ్మకాలతోపాటు, షీటీం సేవలు, వంటి పలు రకాల అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
నాటు వైద్యంపై..
సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో పాము కరిస్తే చాలు దగ్గరలోని దవాఖానకి వెళ్లకుండా పాము కా టేస్తే ఎవరు మంచిగా నాటువైద్యాన్ని ఆశ్రయిస్తున్నా రు. పాములో చాలా వరకు విషరహిత పాములు అ ధికంగా ఉంటాయి విషరహిత పాములు కాటేయడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగదని, నాటువైద్యం దగ్గరకు వెళ్లిన సందర్భంలో వారు నాటు వైద్యం పేరుతో చెవిలో, కంటిలో పసరు మందు వేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వాటిల్లే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాము కరిచిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకి వెళ్లినట్లయితే పాము కాట్లను బట్టి అది విషపూరితం లేదా విషరహిత అనే విషయాన్ని గ్రహించి అందుకు సంబంధించిన టెస్టులను నిర్వహించి వైద్యాన్ని అందిస్తారని వంటి అంశాలపై అవగాహనను కల్పిస్తారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
మూఢ నమ్మకాల వల్ల ఉన్న సమస్యలు కాకుండా కొత్త సమస్యలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. చేతబడులు, తాయత్తులు, బాల్య వివహాలు, వేధింపులు వంటి వాటిపై ప్రజలకు అవగాహనను కల్పిస్తున్నాం. అలాంటి సమస్యలు ఎవరికైనా ఎదురైతే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారాన్ని అందించాలి. లేదా డయల్ 100 కు సమాచారాన్ని చేరవేయాలి.
– కృష్ణసాగర్, జిల్లా కమ్యూనిటీ పోలీసింగ్ లైజనింగ్ అధికారి, వనపర్తి
కళాప్రదర్శనలతో చైతన్యం
మూఢ నమ్మకాలను ప్రజలు నమ్మవద్దని ప్రజలకు పోలీస్ కళాజాత ద్వారా చైతన్య పరుస్తున్నాం. మంత్రాలు, చేతబడులతో సమస్యలు
పరిష్కరిస్తామంటూ ప్రజలను ఎలా మోసం చేస్తారు వంటి వాటిపై ఆటపాటలతో ప్రజలకు అవగాహనను కల్పిస్తున్నాం.
– ప్రవీణ్‌కుమార్, పట్టణ సీఐ, వనపర్తి