అడవితల్లి ఆక్రందన పెడుతున్నది. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ సాగు చేపట్టారు. నాలు గేండ్లుగా.. సుమారు 40 ఎకరాలకుపైగా మామిడి తోటలు వేశారు. కోడేరు మండలం నర్సాయిపల్లి శివారులో అడవుల చుట్టూ తవ్విన కందకాల సరిహద్దులను దాటి పలువురు పండ్ల తోటలు సాగు చేపట్టారు. అలాగే రెండు దశాబ్దాల కిందట 60 ఎకరాల విస్తీర్ణంలో నాటిన నీలగిరి వృక్షాలను మార్చిలో అధికారులు తొలగించారు. ఈ కలప దుంగలను టింబర్ డిపోకు తరలించడమో.. లేదా వేలం వేయడమో చేయాలి.. కానీ బొగ్గు బట్టీలకు విక్రయించి వ్యాపారులతో లోపాయికారిగా అధికారులు ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని ఫారెస్ట్ రేంజర్ చెబుతుండడం విడ్డూరం.
కొల్లాపూర్, మే 19 : అడవుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అటవీ అధికారులు, ఉద్యోగులు తమకు కేటాయించిన ప్రదేశాల్లో పర్యవేక్షణ చేయాలి. కానీ, ఇవేవీ పట్టించుకోవడం లేదు. దీంతో కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కోడేరు మండలం నర్సాయిపల్లి శివారులో రెండేండ్లుగా అడవుల చుట్టూ తవ్విన కందకాల సరిహద్దులను దాటి పలువురు అక్రమార్కులు మామిడి తోటలు సాగు చేయడంతోపాటు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. దీన్ని బట్టి అడవులను కాపాడాల్సిన అధికారుల పర్యవేక్షణ ఏ పాటిదో అర్థమవుతున్నది. అలాగే, అటవీశాఖ ఆధ్వర్యంలో రెండున్నర దశాబ్దాల కిందట రైతు బిచ్చారెడ్డి వ్యవసాయ పొలం సమీపంలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో నాటిన నీలగిరి మహావృక్షాలను మార్చి రెండో వారంలో అటవీ అధికారులు నేలమట్టం చేశారు.
అందుకు ప్రత్యామ్నాయంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జూలైలో వేరే రకం మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి పెంచిన నీలగిరి వృక్షాలను తొలగించిన.. కలప దుంగలను ఇతరులకు విక్రయించేందుకు వాల్టాచట్టం ప్రకారం టింబర్ డిపోకు తరలించాలి. దుంగలకు వేలం వేస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇవ్వాలి. కానీ, స్థానిక అటవీ అధికారులు గుట్టుగా బొగ్గుబట్టీల వ్యాపారులతో లోపాయికారిగా ధర మాట్లాడుకున్నారని సమాచారం. ఈ మేరకు కోడేరు, పస్పుల వద్ద వేర్వేరుగా ఉన్న బొగ్గుబట్టీ వ్యాపారులు మార్చి 25వ తేదీన ట్రాక్టర్లలో నీలగిరి కలప, మొదళ్లను తరలించారు. కానీ, ఫారెస్ట్ రేంజర్ శరత్‌చంద్రారెడ్డి మాటలకు.., అక్కడ జరిగిన దానికి పొంతన లేదు.
60 ఎకరాల్లో పెంచిన నీలగిరి వృక్షాలను జేసీబీలతో తొలగించారు. అయితే, వాటిని అక్కడే కాల్చామని ఫారెస్ట్ రేంజర్ చెబుతున్నారు. వాస్తవంగా ఆ పొలంలో వృక్షాల రెమ్మలను తగులబెట్టిన ఆనవాలు ఎక్కడా లేవు. కనీసం బొగ్గులు కూడా లేవు. తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం పొలాన్ని మొత్తం ట్రాక్టర్లతో దున్నారు. ఇదిలా ఉండగా, కోడేరు-నాగులపల్లి రోడ్డులో ఉన్న రమణయ్య, పస్పుల శివారులో ఉన్న శాంతయ్య బొగ్గుబట్టీల వద్ద నర్సాయిపల్లి అడవుల్లోని నీలగిరి కలప దుంగలు, మొదళ్లు బయటపడ్డాయి. ‘తమతో ఒక అధికారి ఒప్పందం కుదుర్చుకొని మార్చి చివరి వారంలో ట్రాక్టర్ల ద్వారా దుంగలను తరలించాం’ అని సదరు బొగ్గుబట్టీల నిర్వాహకులు తెలిపారు. అయితే, పస్పుల బొగ్గుబట్టీ వద్ద నీలగిరి కలప దుంగలతో కాల్చిన బొగ్గు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నది.
బొగ్గుబట్టీల వద్ద కలప దుంగలు లభ్యమైనట్లు తెలుసుకున్న అధికారులు.. ఈ అక్రమ దందా వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ నెల 10న కొల్లాపూర్ ఎస్బీఐలో శాంతయ్యతో రూ.12,200, రమణయ్య తో రూ.4,100 చలాన్లు కట్టించారు. అయితే, వాల్టా చట్టం ప్రకారం అడవిలో లభించే ఏ వస్తువును అమ్మాలన్నా వేలం పాట నిర్వహించాలి. కానీ ఇవేవీ పట్టకుండా కాసులకు కక్కుర్తి పడి లోలోపల బొగ్గుబట్టీల నిర్వాహకులతో మాట్లాడుకొని దుంగలను తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వేలం పాట వేయకుండా గుట్టుగా కలపను విక్రయించాల్సి అవసరం ఏంటీ..? ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అని స్థానికులు చర్చింకుంటున్నారు.మార్చి 25న నీలగిరి కలప దుంగలు, మొదళ్లు బొగ్గుబట్టీలకు తరలిస్తే.. 45 రోజుల తరువాత చలాన్ ఎందుకు కట్టించుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమంగా మామిడి సాగు..
నర్సాయిపల్లి శివారులోని పచ్చర్ల గట్టు రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దులో అటవీ శాఖాధికారులు రైతు బుచ్చారెడ్డి పొలం వద్ద పిల్లర్ నంబర్ 84 ఏర్పాటు చేశారు. ఆ పిల్లర్ నుంచి మొదలుకొని కొత్తకుంట మధ్య ఉన్న అటవీ సరిహద్దులో గతంలో తవ్విన కందకాలను దాటి కొందరు మామిడితోటను సాగు చేశారు. ఇందులో మామిడి చెట్లకు కాయలు కాస్తుండగా.., ఆ పక్కనే నీలగిరి వనాల్లో సుమారు 20 మామిడి మొక్కలు నాటారు. వాటికి బోరు నీటిని అందించేందుకు పైప్‌లైన్ కూడా చేశారు. ‘అయిపోయిన పెండ్లికి మేళం అన్నట్లుగా’.. నెల రోజుల నుంచి అటవీ సరిహద్దులో అధికారులు జేసీబీతో కందకాలు తవ్వుతున్నారు. పిల్లర్ నంబర్ 50 నుంచి 43 మధ్య సుమారు 40 ఎకరాల్లో అక్రమదారులు మామిడి సాగు చేస్తున్నారు.
వీటికి డ్రిప్ సౌకర్యం కూడా ఉన్నది. అలాగే అటవీ భూమిని సాగు చేసేందుకు చెట్లను నరకడం శోచనీయం. అడవులను నరికి మామిడితోటలను సాగుచేస్తున్న వారిపై దిగదుడుపుగా కేసులు నమోదు చేసి అటవీ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. పచ్చర్లగట్టు వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కొత్తకుంట నుంచి ఇసుక అక్రమ రవాణా చేసినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉన్న గుట్టపై బండరాళ్లు పగులగొట్టారు. దీన్ని బట్టి నర్సాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌పై అటవీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే చెప్పాలి.
నా దృష్టికి రాలేదు
నర్సాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు తన దృష్టికి రాలేదని, విచారణ జరిపిస్తానని స్థానిక ఫారెస్ట్ రేంజర్ శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. నీలగిరి కలప దుంగలకు వాల్టా చట్టం ప్రకారం ఎందుకు వేలం వేయలేదు అనే దానిపై ఆయన సమాధానం చెప్పలేకపోయారు. తన రేంజ్ పరిధిలో ఏం జరుగుతుందో ఎఫ్ఆర్వోకు తెలియకపోవడం కొసమెరుపు.