మహబూబ్నగర్, మే 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) కోయిలకొండ: ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏటా సుమారు 14 లక్షల మంది వలసలు వెళ్లేవారు. వీరిలో సింహభాగం మహారాష్ట్రలోని ముంబయి, పుణెకు వెళ్లి అక్కడి వివిధ పనులు చేసుకుని ఉపాధి పొందేవారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు భయంకరమైన కరువుకు తోడు బోర్లు, బావుల్లో నీళ్లున్నా కరెంటు లేక రైతులు ఆగమయ్యారు. ధైర్యం చేసి వ్యవసాయం చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయం చేస్తే అప్పులు తప్ప ఏమీ మిగిలే పరిస్థితి లేని దశ వచ్చింది. ఊర్లో ఉపాధి లేక కుటుంబం ఆగమవుతుంటే ఇంటి యజమాని చూస్తూ ఊరుకునలేడు కదా… గత్యంతరం లేక చాలా మంది ముంబయి బస్సు ఎక్కక తప్పలేదు. మెరుగైన జీవనం కోసం వందల మైళ్ల దూరం ప్రయాణించారు.
అక్కడ మట్టి పని తట్ట పని అనీ తేడా లేకుండా అన్ని పనులు చేశారు. ఎలాగోలా కుటుంబాన్ని పోషించుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రమంగా పాలమూరు పరిస్థితులు మార్పుచెందడం ప్రారంభమైంది. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మారుస్తూ వచ్చారు. తుమ్మిళ్ల లాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయటం వల్ల 2 లక్షలు మాత్రమే ఆయకట్టు ఉన్న ఉమ్మడి జిల్లాలో నేడు 10 లక్షల పైచిలుకు ఆయకట్టు వచ్చేసింది. గతంలో సాగునీరు లేక కరెంటు సమస్యతో ఇబ్బంది పడిన అన్నదాతకు రెండింటి సమస్య తీరింది. అదృష్టవశాత్తు మంచి వర్షాలు కురిశాయి. మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడంతో జలకళ పెరిగింది. మిషన్ భగీరథతో తాగునీటి సమస్య కూడా తీరింది. అన్నీ సమకూరడంతో వలస వెళ్లిన కూలీలు తిరిగి సొంత ఊళ్లకు వచ్చేశారు. రైతుబంధు సాయంతో వ్యవసాయం చేస్తున్నారు. అయితే కేవలం కొందరు వ్యవసాయ పనులు లేని సయమంలో తిరిగి ముంబయి వెళ్లి అక్కడ పనులు చేసుకుని ఊళ్లకు వచ్చి మళ్లీ సీజన్లో తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవడం కూడా మామూలే. ముంబయి, పుణెతో పాలమూరు వాసులతో కేవలం వలస బంధం మాత్రమే కాదు.
అక్కడ పాలమూరు వాసులు అనేక మంది స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తున్న గిరిజనులు ఎందరో ఉన్నారు. పలువురు కాంట్రాక్టర్లుగా మారి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మరికొంత మంది వివిధ ఉద్యోగాలు సైతం చేస్తున్నారు. స్థానికంగా అవకాశాలు ఉన్న వారు ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటే మెరుగైన ఉపాధి కోసం ముంబయి వెళ్తున్న వారూ ఉన్నారు. బావోజీ జాతరకు వస్తే తండాల్లో వందల సంఖ్యలో ఫార్చునర్లు ఇండ్ల ముందు ఆగుతాయి. ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చాడా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారంతా ముంబయిలో ఆర్థికంగా బాగా స్థిరపడిన పాలమూరు గిరిజన బిడ్డలే. అలా వెళ్లడం బాగా స్థిరపడటం కూడా తప్పే అన్నట్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ముంబయిలో ఉంటున్న పాలమూరు వాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా ఇబ్బంది పడినప్పుడు పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు పాదయాత్రల పేరిట రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.
ఒకప్పుడు పాలమూరు నుంచి ముంబయికి 5 బస్సులు వెళ్లే దశ నుంచి నేడు నారాయణపేట డిపో నుంచి ఒకే ఒక బస్సు మాత్రమే వెళ్లే స్థాయికి పరిస్థితిలో మార్పు వచ్చిందని ముంబయిలో ఉన్న పాలమూరు వాసులు చెబుతున్నారు. ముంబయితో పలువురు పాలమూరు వాసులకు బంధుత్వం, అనుబంధం పెరిగిపోయింది. ముంబయికి సంబంధాలు ఇచ్చిన వాళ్లు, తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లంతా కూడా ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ముంబయి బస్సు ముందు నిలబడి రాజకీయం చేయడం కాదు… పాలమూరు రంగారెడ్డి లాంటి పెద్ద ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి బీజేపీ నాయకులు మాట్లాడితే బాగుండేదని స్థానికులు అంటున్నారు.
వెనకబడిన నారాయణపేట నియోజకవర్గంలోని కొన్ని తండాల్లో 2014కు ముందు తర్వాత పరిస్థితులు బాగా మారిపోయాయి. కోయిలకొండ మండలం హనుమాన్ గడ్డ తండాలో మొత్తం 78 ఇండ్లున్నాయి. ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరైనా ముంబయిలో మంచి స్థానంలో ఉన్నారు. వీరిలో చాలా మంది ముంబయిలో క్లాస్ వన్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. మరికొంత మంది రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నారు. వీళ్ల ఇండ్ల వద్ద తల్లితండ్రులు, ముసలోళ్లు మాత్రమే ఉన్నారు. మరికొందరు స్థానికంగానే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇదే తండాకు చెందిన రైతు భోజ్యానాయక్ కళకళలాడుతున్న బోర్లతో చక్కని పంటలు పండిస్తున్నాడు.
ఈ తండాలో ఉన్న వారిలో అనేక మందికి స్థానికంగా మరియు ముంబయిలోనూ సొంత ఇండ్లున్నాయి. ముంబయిలో పెద్ద పెద్ద బంగ్లాలు సైతం నిర్మించుకుని జీవిస్తున్నారు. ఇదే తండాకు చెందిన సర్పంచ్ సీతాభాయి కొడుకు ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తారు. సర్పంచ్ మరిది పూల్ సింగ్ సైతం స్థానికంగానే వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు వలస పోవాల్సిన అవసరమే రాలేదు. సర్పంచ్ దగ్గరి బంధువులు పుణెలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు. ముంబయి, పుణె నుంచి ఏటా హనుమాన్ జయంతి, బావోజీ జాతరకు ఖరీదైన కార్లలో వచ్చి పండుగలు ఘనంగా నిర్వహించుకుని తిరిగి వెళ్లిపోతారు.
కోయిలకొండ మండలం నక్కవానికుంట తండాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో 80 కుటుంబాలుంటే వీరిలో చాలా మంది కూడా బిల్డర్లు, కాంట్రాక్టర్లు, మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. ముంబయిలో వీరంతా చక్కగా జీవిస్తున్నారు తప్పించి బతకడానికి లాటరీ కొట్టే పరిస్థితి అయితే లేదు. తమ ప్రాంతంలో కంటే మెరుగైన ఉపాధి కోసమే తాము ముంబయిలో ఉంటున్నట్లు తండాకు చెందిన యువకుడు తులసీరాం తెలిపారు. భవిష్యత్తులో తమ రంగంలో ఇంకా ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ తండాలో ఉన్న వాళ్లు కూడా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉన్నారని తెలిపారు.
కోయిలకొండ మండలం రామన్నపల్లి తండాలో 110 కుటుంబాల్లో పలువురు కాంట్రాక్టర్లుగా ఉన్నారు. మరికొంత మంది వివిధ వ్యాపారాలు చేస్తారు. ఇంకొంత సీజనల్గా వివిధ పనులు చేస్తారు. గతంలో వలస వెళ్లిన వారిలో చాలా మంది తిరిగి తండాకు వచ్చేసి ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. రవి నాయక్ అనే యువకుడు ముంబయిలో కూలీ పని చేసి తిరిగి వచ్చేశారు. మూడెకరాల భూమిలో వరిసాగు బోరు కింద వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాదికి రెండు పంటలు తీస్తున్నాడు. అక్కడ కూడ ఖర్చులు పెరిగినాయి. ఇక్కడే ఉండటం మేలని ఉండిపోయాను. రైతుబంధు, 24 గంటల కరెంటు వల్ల వ్యవసాయం చాలా సులభమైపోయింది. పిల్లాపాపలతో ఉండే అవకాశం కూడా ఉన్నందున వెళ్లడం లేదు.
వ్యవసాయమే మేలని పోతలేం..
స్థానికంగా వర్షాలు లేక బోర్లు ఎండిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గతంలో ముంబయి వెళ్లాను. అక్కడ వివిధ పనులు చేసి ఉపాధి పొందాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు మంచి వర్షాలు కురిసి బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. రైతుబంధు కూడా ఇవ్వడంతో ఇక్కడే నాకున్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. ప్రస్తుతం వరి పంట కోత దశకు చేరుకుంది. నేను నా భార్య కలిసి హాయిగా పొలం పనులు చేసుకుంటున్నాం.
– రవినాయక్, రామన్నపల్లి తండా
ఇప్పుడు ఇక్కడే బాగుంది
2014కు ముందు స్థానికంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక ముంబైకి వలస వెళ్లాను. ముంబయిలో కొందరికి కలిసి వస్తుంది. నాకైతే ఏదో అలా గడిచిపోయింది. తెలంగాణ ఏర్పాటుతో పరిస్థితులు మారిపోయి వ్యవసాయానికి అనుకూలంగా మారడంతో నేను తండాకు తిరిగివచ్చాను. నాకున్న 3 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. వరి పంట ఇప్పుడు కోత దశకు వచ్చింది. సర్కారే వడ్లు కొంటుండటంతో ఏ చింతా లేదు. ముంబయి కంటే నాకు ఇక్కడే బాగుంది.
– బోజ్యానాయక్, హనుమాన్గడ్డ తండా
సొంత ఊరి కష్టమే మేలు..
ముంబై పోయి పని చేసుడు కంటే సొంత ఊరిలో వ్యవసాయం చేసుకోవడం మేలు. భూమిని సాగు చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉంటున్నా. గతంలో ముంబయికి పోయినా అక్కడ పెద్దగా ఉపయోగం అనిపించలేదు. కానీ అప్పుడు తండాలో ఉన్న పరిస్థితుల వల్ల బలవంతంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కాలం కలిసి రావడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్లు ఇలా అన్నింటా మమ్మల్ని ఆదుకుంటున్నది. అంతా సంతోషంగా ఉన్నాం.
– గుండ్యానాయక్, రామన్నపల్లితండా