వనపర్తి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా కేంద్రంలో శరవేగంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. కానీ, కొంతమంది నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నారు. మున్సిపల్ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా సెట్బ్యాక్తోపాటు, పార్కింగ్ స్థలానికి తిలోదకాలు ఇచ్చి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకుంటున్నప్పటికీ అది కేవలం పర్మిషన్ వరకే పరిమితం చేస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందిన ప్లాన్‌ను నిర్మాణంలో పాటించడం లేదు. నిర్మాణ సమయంలో అనుమతి పొందిన ప్లాన్‌ను ఫ్లెక్సీపై ముద్రించి అందరికీ కనిపించేలా నిర్మాణ ప్రదేశంలో ప్రదర్శించాల్సి ఉన్నా పాటించడం లేదు. టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
నిర్మాణాలను క్ష్రేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన మున్సిపల్ ఇంజినీర్లు, విజిలెన్స్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రధాన రహదారుల పక్కన ట్రాఫిక్ సమస్యగా మారుతున్నది. పార్కింగ్ స్థలంలేక రోడ్లపైనే వాహనాలు నిలిపే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇచ్చిన అనుమతులు ఇప్పుడు నగరవాసులకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఇతర దుకాణాలు రోడ్లకు అనుకొని నిర్మించారు. వనపర్తితోపాటు కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలో ఇదే తంతు కొనసాగుతున్నది. సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించకుండానే వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఫ్లోర్లకు మాత్రమే అనుమతి తీసుకొని బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
పార్కింగ్ స్థలం లేకుండానే..
అనుమతులు ఇచ్చాం ఇక మాకు సంబంధం లేదన్నట్లు మున్సిపాలిటీ వ్యవహరిస్తుండటంతో నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నివాస గృహాల విషయంలో చాలావరకు పట్టించుకోనప్పటికీ కమర్షియల్ బిల్డింగ్స్ విషయంలో కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే నిర్మాణాల విషయంలో ప్రధాన కూడళ్లు, రహదారుల వెంబడి పరిశీలిస్తే ఒక దుకాణం ముందుకు వస్తే మరో దుకాణం వెనుకకు నిర్మించబడి ఉంటుంది. నిబంధనల ప్రకారం 100ఫీట్ల రోడ్డుకు నిర్మించే దుకాణా సముదాయాల విషయంలో రోడ్డు మధ్య నుంచి సరిగ్గా 50 ఫీట్లు వదిలి ప్లానుకు అనుమతి ఇవ్వాలి. యాభై ఫీట్లు పోనూ అదనంగా మరో 10 ఫీట్లు పార్కింగ్ కోసం అనుమతి పొందిన కమర్షియల్ బిల్డింగ్ ముందు స్థలాన్ని వదిలేయాలి. ఇలాంటివేమీ పాటించకుండానే కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు.
కమిటీకి నివేదిస్తాం
అనుమతులు లేకుండా నిర్మాణాలు, ఒక ఫ్లోర్‌కు అనుమతి తీసుకొని బహుళ అంతస్తులు నిర్మించడం, పార్కింగ్, సెట్‌బ్యాక్ వదలకుండా నిర్మించడం నిబంధనలు ఉల్లంఘించినట్లే. చర్యలు తీసుకునేందుకు జిల్లాస్థాయిలో ఐదుగురు సభ్యులతో టీం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీకీ వచ్చిన ఫిర్యాదులను వారికి రెఫర్ చేస్తాం. అవసరమైతే కూల్చివేస్తారు. భవన నిర్మాణంలో నిబంధనలు పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
– గట్టుయాదవ్, మున్సిపల్ చైర్మన్, వనపర్తి
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మున్సిపల్ చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకే భవనాలు నిర్మించాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు దృష్టికి వస్తే చర్యలు తప్పవు. అనుమతులకు సమర్పించిన ప్లాన్‌కు భిన్నంగా నిర్మణాలు చేపడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగం, విజిలెన్స్ విభాగం పర్యవేక్షిస్తారు. సెట్‌బ్యాక్ వదలకుండా కట్టడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగే అవకాశముంటుంది. పార్కింగ్‌కు స్థలం వదలకుండా భవనాలు నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే యజమానిపై చర్యలు తీసుకుంటాము.
– ఆశీష్సెంగ్వాన్, అదనపు కలెక్టర్, వనపర్తి