అలంపూర్, ఏప్రిల్ 23 : అలంపూర్లో రాజుల కా లంలో నిర్మించిన అపూర్వ కట్టడాలు యాత్రికులను అ బ్బురపరుస్తున్నాయి. కాలగమనంలో అలనాటి శిల్పసంపద, కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నా యి. పురాతన కట్టడాలు, ఆలయాలు, బురుజు లు, కోటలు, తుంగభద్ర నదిలో 64 స్నానఘట్టాలు, అలనాటి చరిత్రను నేటితరానికి తెలియచెప్పే నిర్మాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఇదిలా ఉండగా, 24 ఆలయాల సముదాయమైన పాపనాశినికి వెళ్లే మార్గంలో ఉన్న మబ్బుమఠం నుంచి కర్నూల్లోని కొండారెడ్డి బురుజు వరకు భూగర్భ (రహస్య) మార్గం ఉందని పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఇందులో మరో విశేషం కూడా ఉన్నది. తుంగభద్ర నది కింద నుంచి ఈ మార్గాన్ని రహస్యంగా వినియోగించుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా, ఇప్పుడు ఆ మబ్బు మఠం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నది. ఈ విషయంలో కేంద్ర పురావస్తు శాఖ దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.