మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్‌నగర్ రూరల్: కేంద్రం వడ్లు కొనకుండా మోసం చేస్తుందనే విషయం అర్థమై.. రైతులను వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ ముందే జాగ్రత్తలు తీసుకున్నారని కానీ తాము వడ్లు కొంటమని బీజేపీ నాయకులు ఉత్తర ప్రగల్బాలు పలికి రైతులను మోసం చేశారని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. బీజేపీ నాయకులు రైతులను తప్పుదారి పట్టించి పంట చేతికి వచ్చాక వడ్లు కొనకుండా మోసం చేశారన్నారు. అయినా సీఎం కేసీఆర్ రైతులను తన భుజస్కంధాలపై వేసుకుని వేలాది కోట్ల రూపాయలు ఖర్చయినా వడ్లు కొనేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 191కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. గతంలో ఏనాడైనా ఈ పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం తెలంగాణలోని 70శాతం భూభాగానికి నీళ్లిస్తుందని, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మొత్తం తెలంగాణకు సాగునీరు అందినట్లు అవుతుందన్నారు. తెలంగాణ లాగే దేశమంతా రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్ అందించాలనేది కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్ త్వరలోనే దేశవ్యాప్తంగా రైతు విప్లవం తీసుకొస్తారని మంత్రి తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి పరిమితం కాదని దేశ రైతాంగం, సంక్షేమం కోసం పనిచేస్తారన్నారు. కొంచెం కూడా సిగ్గులేకుండా బీజేపీ నాయకులు ఇప్పుడు పాలమూరులోనే పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి తమ నడ్డి విరుస్తున్నారని బండి సంజయ్ పాదయాత్రలో ప్రజలు ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగడం సిగ్గు చేటని మంత్రి విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని, తామే కట్టిస్తామని బీజేపీ జాతీయ నేతలు అనేకమార్లు హామీ ఇచ్చారని ఇప్పుడేం మొహం పెట్టుకుని పాదయాత్రలు చేస్తారని ప్రశ్నించారు. నేటి వరకు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నయాపైసా ఇవ్వలేదని తెలిపారు. గతంలో కరెంటు లేక ఏఈలు, లైన్మెన్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్బంధించేవారని, కేసీఆర్ సీఎం అయ్యాక కరెంటు పరిస్థితే దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. దేవుళ్లపై తమకే పేటెంట్ హక్కులున్నట్లు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఆదుకునే ప్రభుత్వం కావాలా… మత విద్వేషాలు పెంచే ప్రభుత్వాలు కావాలా అనేది ప్రజలకు బాగా తెలుసన్నారు.
నోరు తెరిస్తే బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. మహబూబ్‌నగర్‌లో ఎన్నికలలోపు మత కలహాలు, గొడవలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బాగు పడుతున్న పాలమూరులో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని ఈ విషయం ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అతి పెద్ద గుడి యాద్రాద్రిని కట్టించిన కేసీఆర్ అన్ని మతాలను సమానంగా ఆదరించే గొప్ప వ్యక్తన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుతో పాటు రూ.1960 మద్దతు ధర అందిస్తూ అన్నదాతకు అండగా ఉన్నందుకు రైతులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్ర పటానికి ధాన్యంతో అభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు తేజస్‌నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, జిల్లా డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు షేక్ఉమర్, శ్రీనివాసులు, మునీర్, షబ్బీర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అర్షద్అలీ, నాయకులు అన్వర్‌పాషా, జేజేఆర్ రహెమాన్, విఠల్‌రెడ్డి, మోసీన్, జలీల్, అంజద్, నవకాంత్, ప్రశాంత్, శాంతయ్య, శివరాజ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సెక్యూలర్ ప్రభుత్వంమంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 19: టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్యూలర్ ప్రభుత్వమని ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం హెచ్‌బీ గార్డెన్, రోస్ గార్డెన్, కమలా గార్డెన్లో ముస్లింలకు మంత్రి కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ గురుకులు పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. వీరన్నపేటలో రూ.100కోట్లతో మైనార్టీ బాలికలకు గురుకుల భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తరహా మహబూబ్‌నగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.