నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 12 : పద్మశ్రీ అవార్డు గ్రహీత..నల్లమల ప్రాంత గ్రామీణ జానపద కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కొత్తగా ఏర్పాటు చేసిన యూట్యూబ్ చానల్‌ను కలెక్టర్ ఉదయ్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో యూట్యూబ్ చానల్ లోగోను ఆవిష్కరించిన మాట్లాడారు. మొగులయ్య దేశం మెచ్చిన గొప్ప కళాకారుడన్నారు. చానల్ ఎక్కువ మందికి తెలిసేవిధంగా ప్రచారం చేయాలని సూచించారు. యూట్యూబ్‌లో మొగులయ్య పాటలను కోట్ల సంఖ్యలో అభిమానులు ఆదరిస్తున్నారని, చానల్ ఏర్పాటుతో ఆయన పాటలు మరింత దగ్గర కావడానికి అవకాశం లభించిందన్నారు. మొగులయ్య మాట్లాడుతూ తనకు రెండు రాష్ర్టాల్లో కోట్ల సంఖ్య అభిమానులు ఉన్నారని, యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేస్తే అభిమానులు ఆదరించే అవకాశం ఉందని చెప్పారని గుర్తుచేశారు. యూట్యూబ్‌లో ‘కిన్నెర మొగులయ్య టీవీ’ అనే క్లిక్ చేస్తే తన పాటలు వస్తాయని, అందులో సబ్‌స్ర్కైబ్ చేసుకొని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, జిల్లా పౌరసంబంధాల అధికారి సీతారాం, అచ్చంపేట ఆర్డీవో పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.