తిమ్మాజిపేట, ఏప్రిల్ 12;16ఏండ్ల కిందట పదో తరగతి చదివిన వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు..అంతా కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వారిలో ఏదో అసంతృప్తి.. కొంత మంది మిత్రులు అక్కడికి రాలేకపోయారని..ఇక వెంటనే గైర్హాజరైన మిత్రుల వివరాలు ఆరా తీసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు..ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ‘నేస్తం సహాయ నిధి’ పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. తమ బ్యాచ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వారిది ఒక్కొక్కరిది ఒక్కో ఊరు.. వారందరినీ ఒకేచోటుకు చేర్చింది నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట బడి. అంతా కలిసి 2005-06లో పదో తరగతి వరకు చదివారు. అచ్చంపేట, అమ్రాబాద్, మన్ననూర్ లాంటి దూర ప్రాతాల నుంచి వచ్చి పదోతరగతి వరకు విద్యనభ్యసించారు. అనంతరం పైచదువుల నిమిత్తం అంతా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా జెడ్పీహెచ్ఎస్ తిమ్మాజిపేట ఎస్సెస్సీ 2005-06 అనే పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని మిత్రుల క్షేమ సమాచారం తెలుసుకునేవారు. 12ఏండ్ల తర్వాత 2018లో మొదటి సారిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మళ్లీ అందరూ కలుసుకున్నారు. భారీ మొత్తంలో డబ్బు ఖర్చుచేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కొందరు మిత్రులు ఇంత డబ్బు వృథా చేస్తున్నాం..ఇందులో కొంతైనా మంచి పనికి వాడుకుంటే బాగుంటుందని సలహా, సూచనలు చేశారు. అందరూ కలిసి చర్చించుకొని తమలోనే ఇబ్బందులు పడుతున్న మిత్రులకు సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తిమ్మాజిపేట యూనియన్ బ్యాంక్లో ‘నేస్తం సహాయ నిధి’ పేరు మీద జాయింట్ ఖాతా తెరిచి ప్రతి ఒక్కరూ నెలనెలా ఎవరికి తోచినంత వారు డబ్బులు ఖాతాలో జమ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇవీ కార్యక్రమాలు
తిమ్మాజిపేటకు చెందిన కాకి బాలరాజు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని 2021 జూలైలోరూ. 34,000 వైద్య ఖర్చుల నిమిత్తం నేస్తం సహాయ నిధి ద్వార ఆర్థికసాయం చేశారు.
2022 జనవరి 1న అప్పాజిపల్లి గ్రామానికి చెందిన వీఆర్వో కురుమయ్య ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది. మిత్రులందరూ మానవత్వంతో ఆలోచించి కురుమయ్య చిన్న కూతురును చదివించడానికి నేస్తం సహాయ నిధి ద్వారా రూ.60,000 ఆర్థికసాయం అందజేశారు.
మార్చి30న మండలంలోని ఇప్పలపల్లి చెందిన తమ స్నేహితురాలు యాదమ్మ కుమార్తె కిడ్నీ సంబంధిత వ్యాధి చికిత్స కోసం డబ్బులు అవసరం కావడంతో ఆమె ఇంటికి వెళ్లి రూ.30వేలు అందజేశారు. తమ పాఠశాల నుంచి ప్రతి ఏడాది ఓ పేద విద్యార్థిని దత్తత తీసుకొని చదివించనున్నట్లు ప్రకటించారు.
స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తాం..
2005-06 బ్యాచ్ మిత్రులందరం కలిసి ఓ మంచి ఆలోచనతో నేస్తం సహాయనిధి నుంచి ఎవరకి ఏ ఆపద వచ్చినా వెంటనే గ్రూప్లో సమాచారం అందించి డబ్బులు జమ చేసి ఇస్తున్నాం. ఇప్పటి వరకు విద్యా, వైద్యానికి ప్రాధాన్యతనిచ్చాం. ఇక ముందు కూడా స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తాం.
– సి.శివ, తిమ్మాజిపేట
దత్తత తీసుకుంటాం..
మా బ్యాచ్ మిత్రులకు మంచి సపోర్ట్ ఇస్తున్నాం. మేము అందుబాటులో లేకున్నా నెల నెలా డబ్బులు నేస్తం సహాయనిధి అకౌంట్లో జమ చేస్తున్నాం. ఇక ముందు మా బ్యాచ్ సభ్యులతో పాటు తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తాం.
–జీ.వీణ, హైదరాబాద్ పూర్వవిద్యార్థిని